ఆంధ్రపదేశ్ లో స్థానిక ఎన్నికల వ్యవహారం ఎంత రాజకీయ రచ్చకు కారణమయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై ‘కుల ముద్ర’ వేసింది అధికార పార్టీ. ఆయన్ని తొలగించింది కూడా. కొత్త ఎస్ఇసి ఎంపిక కూడా జరిగింది. కానీ, కోర్టు జోక్యంతో కొత్త ఎస్ఈసీ తన పదవిని కోల్పోవాల్సి వచ్చంది. పాత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తన పదవిని నిలబెట్టుకున్నారు.
రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరగాలన్నదానిపై ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవాలి. కానీ, వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి, స్థానిక ఎన్నికలు ఏప్రిల్‌లో జరుగుతాయని జోస్యం చెప్పారు. తిరుపతి ఉప ఎన్నిక తర్వాతే స్థానిక ఎన్నికలు జరుగుతాయన్నది విసారె జోస్యం తాలూకు సారాంశం. ఇంతకీ, తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందట.? ఈ వ్యవహారంపై కూడా విసారెకు ఓ అవగాహన వున్నట్టే వుంది. అందుకేనేమో ఆయన, తిరుపతి ఉప ఎన్నిక తర్వాతనే స్థానిక ఎన్నికలు జరుగుతాయని ఘంటాపథంగా చెబుతున్నారు.
విశాఖలో వైసీపీ ప్లీనరీ సమావేశం, అందులో పాత కమిటీలు రద్దు చేసి, కొత్త కమిటీల ప్రకటన జరుగుతుందని విజయసాయిరెడ్డి చెప్పడం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అది ఆయనకు వున్న అదికారమే కావొచ్చు. కానీ, స్థానిక ఎన్నికల విషయమై విసారె జోస్యం చెబితే ఎలా.? పైగా, ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో వుంది.
ప్రభుత్వం ఓ కమిటీని వేసి, స్థానిక ఎన్నికల విషయమై ఎస్ఈసీతో చర్చించాలని న్యాయస్థానం ఇప్పటికే స్పష్టం చేసింది. ఆ వ్యవహారం ఓ కొలిక్కి రాకుండానే, స్థానిక ఎన్నికలపై విజయసాయిరెడ్డి జోస్యం చెప్పడమంటే.. ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే. నిజానికి, వైసీపీ.. నిమ్మగడ్ రమేష్ కుమార్ ఎస్ఈసీగా పదవిలో వున్నంతకాలం స్థానిక ఎన్నికలు జరగకూడదన్న ఆలోచనతోనే వుంది. మంత్రులు ఇదే విషయాన్ని పలుమార్లు కుండబద్దలుగొట్టేశారు కూడా.