ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇస్మార్ట్ శంకర్ తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే. ఈ సినిమా తర్వాత ఒక రీమేక్ కు ఓటు వేసాడు రామ్. తమిళంలో సూపర్ హిట్ అయిన తడం చిత్రాన్ని ఎరికోరి మరీ రీమేక్ చేసాడు. రెడ్ సినిమా పేరిట నిర్మితమైన ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసాడు. రెండు రోజుల ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికి రెడ్ విడుదలై వారం రోజులు కావోస్తుండేది. రెడ్ ఏప్రిల్ 9న విడుదల చేద్దామని భావించారు కానీ అది సాధ్యపడలేదు. ప్రస్తుతం కరోనా కారణంగా లాక్ డౌన్ లో ఉన్న నేపథ్యంలో థియేటర్లను మూసివేశారు. ఎప్పటినుండి తెరుస్తారు అన్నదానిపై క్లారిటీ లేదు.
దీన్ని ఆసరాగా చేసుకుని ఓటిటి సంస్థలు రెడ్ నిర్మాతలకు భారీ రేట్లను ఆఫర్ చేసాయి. థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే డిజిటల్ గా సినిమాను విడుదల చేయమని ఊరించాయి. అయితే నిర్మాత స్రవంతి రవి కిషోర్ ఎంత ఆలశ్యమైనా థియేటర్లలోనే మొదట సినిమాను విడుదల చేస్తామని తేల్చి చెప్పేసారు.
ఈ నేపథ్యంలో థియేట్రికల్ రిలీజ్ తర్వాతైనా డిజిటల్ గా స్ట్రీమ్ గా చేయడానికి రైట్స్ కోసం ప్రముఖ ఓటిటి సంస్థలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ మధ్య పోటీ ఉన్నట్లు సమాచారం. ఈ రెండు సంస్థలు నుండి భారీ రేట్లకు ఆఫర్లు ఉన్నా కానీ నిర్మాత ఇంకా ఏ విషయం తేల్చలేదు. కొంత సమయం ఆగి అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు.