ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.? ముందూ వెనుకా ఆలోచించకుండా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇచ్చిన బంపర్ ఆఫర్‌కి ఓకే చెప్పేయొచ్చు. ఎందుకంటే, ఇలాంటి ఆఫర్ ఇంకోసారి రాదు.
ఎటూ, వైఎస్ జగన్ సర్కార్‌కి అమరావతిని నిర్మించడం చేతకావట్లేదు. ‘లక్ష కోట్లు ఒకే చోట ఖర్చు పెడితే, రాష్ట్రం మొత్తం ఏమైపోవాలి.?’ అంటూ అడ్డగోలు రాజకీయాలు చేస్తోంది ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. లక్ష కోట్లు కాకపోతే, 50 వేల కోట్లు ఖర్చు చెయ్యండి.. అదీ కాకపోతే పాతిక వేల కోట్లు ఖర్చు చేయండి.. ఇంకా కుదరకపోతే, ఓ పది వేల కోట్లు ఖర్చు చేయండి. అమరావతిని నిర్మించండి.!’ అని ఎవరెంతలా మొత్తుకుంటున్నా, ససేమిరా అంటోంది వైఎస్ జగన్ సర్కార్.
ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ ఓ అడుగు ముందుకేసింది. తాము అధికారంలోకి వస్తే 5 వేల కోట్లతో అమరావతిని నిర్మించేస్తామని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు. వున్నపళంగా అమరావతి ప్రాజెక్టుని, ‘మాకు చేత కాదు మొర్రో..’ అని చెప్పేసి, కేంద్రానికి వైఎస్ జగన్ సర్కార్ అప్పగించేస్తే.. ఓ పనైపోద్ది. కానీ, అసలంటూ అమరావతిని నిర్మించే ఉద్దేశ్యం వైఎస్ జగన్ సర్కార్‌కి లేదు. అందుకే, అధికారంలోకి వచ్చాక అమరావతి పనులు ఒక్క అడుగు కూడా ముందుకు కదలకుండా బ్రేక్ వేసేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం.
నిజానికి, రాష్ట్రం పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి వైఎస్ జగన్ సర్కార్‌కి వున్నా.. తొలుత అమరావతిని ఓ మోస్తరుగా అయినా అభివృద్ధి చేసి, ఆ తర్వాత మూడు రాజధానులే అంటారో, ముప్ఫయ్ రాజధానులే అంటారో.. అలా అధికార వికేంద్రీకరణ చేసుకోవచ్చు. నిజమే, చంద్రబాబు లక్ష కోట్ల రాజధాని.. అంటూ అమరావతిని గాల్లో నిలబెట్టేశారు. అది పాతాళంలోకి పడిపోయిందిప్పుడు. దాన్ని పైకి లేపాలంటే, వైఎస్ జగన్ సర్కార్‌కి చిత్తశుద్ధి వుండాలి. కానీ, అది వైసీపీ ప్రభుత్వం నుంచి ఆశించలేం.
ఇప్పుడీ 5 వేల కోట్లతో అమరావతి రాజధాని.. అంటూ సోము వీర్రాజు చేసిన ప్రకటన మాత్రం ఖచ్చితంగా అందర్నీ ఆలోచింపజేస్తుంది. అది పరోక్షంగా వైఎస్ జగన్ సర్కార్‌కి ఎదురు దెబ్బే.! జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్నప్పుడు, రాజధాని అమరావతిని కేంద్రమెందుకు నిర్మించకూడదు.? ఈ దిశగా లోతైన చర్చ జరిగి తీరాల్సిందే. ఏపీలో బీజేపీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందోగానీ, ఈలోగా.. తమకున్న ‘పవర్’ని ఉపయోగించి బీజేపీ, అమరావతి బాధ్యతను కేంద్రం తీసుకునేలా చర్యలు చేపడితే మంచిదేమో.!