జ్వరం వస్తే.. అది తగ్గడానికి పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేస్తాం. పరిసరాల పరిశుభ్రత కోసం బ్లీచింగ్ పౌడర్ చల్లుతాం. ఇది చిన్న పిల్లాడికి కూడా తెలిసిన విషయాలే. ఓ ముఖ్యమంత్రి, ప్రపంచాన్ని వణికస్తోన్న మహమ్మారి విషయంలో ‘పారాసిటమాల్.. బ్లీచింగ్ పౌడర్..’ అంటూ వ్యాఖ్యలు చేస్తే ఎలా.? పైగా, పదే పదే ఆ వ్యాఖ్యల్ని ముఖ్యమంత్రి, ఆయన అనుచరగణం, అనుకూల మీడియా సమర్థించుకోవడం ద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతుందా.? కీడు జరుగుతుందా.?
లాక్‌డౌన్‌కి ముందు, ఈ పారాసిటమాల్ ట్యాబెట్లనే విదేశాల నుంచి వచ్చిన చాలామంది వాడారు.. ఈ క్రమంలోనే వాళ్ళలో చాలామంది ఎయిర్‌పోర్టుల్లో థర్మల్ స్క్రీనింగ్ నుంచి బయటపడ్డారు. ఫలితంగా దేశంలో కరోనా ఏ స్థాయిలో విస్తరించిందో చూస్తున్నాం. మత ప్రార్థనలకు వెళ్ళి, కరోనా అంటించుకుని వచ్చినవారూ ఇదే పద్ధతి ఫాలో అయ్యారంటే పారాసిటమాల్ ‘పనితనం’ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
కోరోనా వైరస్ సోకితే, జ్వరం కూడా వస్తుంది. అలాగని, జ్వరానికి వాడే పారాసిటమాల్ వేస్తే కరోనా వైరస్ తగ్గుతుందా.? ఏంటీ చెత్త లాజిక్.? కొంతమందిలో కరోనా వైరస్ లక్షణాలు అస్సలేమాత్రం కన్పించకుండానే ఆ వైరస్ బయటపడ్తోంది. తద్వారా తెలియకుండానే చాలామందికి కరోనా వైరస్‌ని అంటించేస్తున్నారు. ఇవన్నీ వాస్తవాలు. పారాసిటమాల్‌ని వాడాల్సిందేనేమో.. బ్లీచింగ్ పౌడర్ చల్లడం కూడా మంచిదేనేమో.! కానీ, వాస్తవ పరిస్థితుల్ని ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులు అర్థం చేసుకోకపోవడమే దారుణం.
కరోనా వైరస్ సోకితే ఊపిరితిత్తులు పాడైపోతాయి మొర్రో.. అని పలు వైద్య నివేదికలు చెబుతున్నాయి. గుండెకు సంబంధించిన రక్త నాళాలు దెబ్బతింటాయని మెడికల్ జర్నల్స్ పేర్కొంటున్నాయి. ఇవన్నీ పరిశోధనలు.. సొల్లు కబుర్లు కానే కావు. కిడ్నీ, లివర్ వంటి కీలక అవయవాలు దెబ్బతింటున్నాయి కరోనా వైరస్ కారణంగా. కరోనా వైరస్ బారిన పడ్డ వారికి భవిష్యత్తులోనూ అనారోగ్య సమస్యలు వస్తాయన్న అనుమానాల్ని పలు పరిశోధనలు వ్యక్తం చేస్తున్నాయి.
ఇంతటి ప్రమాదకరమైన వైరస్‌తో ‘కలిసి జీవించడం’ అన్న ఆలోచన చేయగలమా.? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడటం.. పైగా తన అవివేకాన్ని పదే పదే సమర్థించుకోవడం.! నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది వ్యవహారం. రూపాయి పారాసిటమాల్, పది రూపాయల బ్లీచింగ్ పౌడర్‌ని కాదని.. వందల కోట్లు.. వేల కోట్లు.. లక్షల కోట్లు ఎందుకు దేశాలు వెచ్చిస్తున్నట్లు.? కాస్తంత ఇంగితం వుండాలి కదా.!