కొద్ది రోజులపాటు జగన్ సర్కారు కి న్యాయస్థానాల నుంచి మొట్టికాయలు కాస్త తగ్గాయనుకునేలోపు, మళ్ళీ జాతర షురూ అయ్యింది. ‘రోజులు మారాయ్.. మాకూ అనుకూలంగా తీర్పులొస్తున్నాయ్..’ అని పలు కేసుల విషయమై అధికార వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా పండగ చేసుకున్న విషయం విదితమే.
స్థానిక ఎన్నికలు, అచ్చెన్నాయుడి అరెస్ట్ తదితర వ్యవహారాల సందర్భంగా వైసీపీ మద్దతుదారులు చేసుకున్న పండగ అది. కానీ, వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చింది. మొన్న జువారీ సిమెంట్ ఎపిసోడ్, నిన్న ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమర్ రాజా బ్యాటరీస్ వ్యవహారం, తాజాగా సంగం డెయిరీ వ్యవహారం.. ఇలా ఒకదాని మీద ఇంకోటి.. అన్నట్టు షాకుల మీద షాకులు తగులుతున్నాయి ప్రభుత్వానికి.
తాజా వ్యవహారానికొస్తే, సంగం డెయిరీని ప్రభుత్వ పరిధిలోకి తీసుకొస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై సంగం డెయిరీ డైరెక్టర్లు కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయస్థానం, ప్రభుత్వ జీవో చెల్లదని తేల్చింది. సంగం డెయిరీ డైరెక్టర్లు, రోజువారీ సంస్థ కార్యకలాపాల్ని నిర్వహించుకోవచ్చని తేల్చి చెప్పింది. అయితే, సంస్థ ఆస్తుల్ని విక్రయించాలనుకుంటే మాత్రం, కోర్టుకి తెలపాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
సంస్థ నిర్వహణలో డైరెక్టర్లకే పూర్తి హక్కులుంటాయని న్యాయస్థానం వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదిలా వుంటే, సంగం డెయిరీ ఛైర్మన్, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రను ఇటీవల ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం విదితమే. రిమాండ్ సందర్భంగా అనారోగ్యానికి గురైన ఆయన్ను ఓ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.
మొత్తమ్మీద, తమకు అనుకూలంగా తీర్పులొచ్చినప్పుడు పండగ చేసుకోవడం, అనుకూలంగా తీర్పులు రానప్పుడు కోర్టులకు దురుద్దేశాలు ఆపాదించడం ‘బులుగు బ్యాచ్’కి పరమ రొటీన్ వ్యవహారమైపోయింది. ఆయా కేసుల్లో డొల్లతనమే ప్రభుత్వానికి ఇలా మొట్టికాయలు తగలడానికి కారణమన్నది న్యాయ కోవిదుల అభిప్రాయం.