తెలంగాణ ప్రభుత్వం నిన్ననే స్పష్టత ఇచ్చింది అంబులెన్సుల్ని, తెలంగాణలోకి అనుమతించే విషయమై. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఓ ప్రకటన రాగానే, పొరుగు రాష్ట్రం ఆంధ్రపదేశ్ అప్రమత్తమవ్వాలి కదా.? తమ రాష్ట్రం నుంచి తెలంగాణకు వెళ్ళే కరోనా బాధితుల్ని అప్రమత్తం చేయాలి కదా.? వారిని ఆదుకునేందుకు ప్రయత్నించాలి కదా.? కానీ, ఇవేవీ జరగలేదు.
‘తెలంగాణ ప్రభుత్వం అంబులెన్సుల్ని రానివ్వడంలేదు..’ అంటూ ఆంధ్రపదేశ్ రాష్ట్రం నుంచి ఎవరు గగ్గోలు పెట్టినా ప్రయోజనం లేదు. ఇప్పటికే ఇద్దరు ఈ రోజు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా పోయిన ప్రాణాలు తిరిగి రావు. ఏపీ ప్రభుత్వం, అంబులెన్సు డ్రైవర్లకు ఓ అప్పీల్ చేయాల్సి వుంది.. అదే సమయంలో, కరోనా బాధితులెవరూ ఇప్పుడున్న పరిస్థితుల్లో పొరుగు రాష్ట్రాలకు వెళ్ళొద్దు.. అని చెప్పాల్సి వుంది. కానీ, ఆంధ్రపదేశ్ ప్రభుత్వం అలా చెయ్యలేదు. కారణమేంటి.?
ఆంధ్రపదేశ్ రాష్ట్రం, కరోనా బాధితులకు చికిత్స అందించే పరిస్థితుల్లో లేదా.? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్న విషయం విదితమే. చాలామంది కోలుకుంటున్నారు కూడా. వైద్య సౌకర్యాల పరంగా చాలా మెరుగ్గా వున్నామని చెబుతోంది ఆంధ్రపదేశ్ ప్రభుత్వం. పైగా, బులుగు బ్యాచ్.. ఏపీలో కరోనా బాధితులకు వైద్యం ఉచితమంటూ అర్థం పర్థం లేని ప్రచారం చేస్తోందాయె.
ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో బోల్డన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులున్నాయి. అంబులెన్సుల్ని.. తెలంగాణ వైపు పంపించాల్సిన అవసరమేంటో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. అన్నిటికీ మించి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సన్నిహిత సంబంధాలున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ సమస్యకు పరిష్కారం నిన్ననే ఎందుకు వెతకలేకపోయారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.