రెండేళ్ళ పాలన విషయమై అధికార వైసీపీ చేసుకుంటున్న ప్రచారం అంతా ఇంతా కాదు. పెన్షన్ల మొత్తాన్నీ పెంచేశాం.. విద్యార్థులకు స్కూల్ యూనిపాంలు అందించేస్తున్నాం.. అమ్మ ఒడి ఇస్తున్నాం.. జగనన్న వసతి దీవెన సహా చాలా చాలా చేసేశాం, చేసేస్తూనే వున్నాం. దాదాపుగా రాష్ట్రంలో అన్ని కుటుంబాలూ ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా లబ్ది పొందుతున్నాయ్.. అంటూ వైసీపీ చేసుకుంటున్న ప్రచారం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
అంతా బాగానే వుందిగానీ, రాష్ట్ర ప్రభుత్వం గడచిన రెండేళ్ళల్లో చేసిన అప్పులెంత.? వాటికి కట్టిన, కట్టాల్సిన వడ్డీలెంత.? ప్రజల మీద పడుతున్న భారమెంత.? ఈ ప్రశ్నలకి కూడా వైసీపీ ప్రభుత్వం సమాధానం చెబితే బావుంటుంది. ఫలానా పథకాన్ని ప్రారంభిస్తున్నాం, అమలు చేస్తున్నామంటూ ప్రకటనల కోసం కూడా ప్రభుత్వ ఖజానా నుంచే ఖర్చు చేస్తున్న జగన్ సర్కార్, ప్రతి నెలా చేస్తున్న కొత్త అప్పుల గురించీ, వాటి వడ్డీల గురించి కూడా ప్రకటనలు ఇస్తే ప్రజలకు వైఎస్ జగన్ సర్కార్ చెప్పి చేస్తున్నవీ, చెప్పకుండానే ఉద్ధరించేస్తున్నవీ ఏంటనేది ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది.
పెట్రోల్ ధర పొరుగు రాష్ట్రాలతో పోల్చితే, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఎందుకు ఎక్కువగా వుంది.? పన్నులు ఎందుకు పెరుగుతున్నాయి.? వంటి అంశాలపైనా ప్రకటనలు గుప్పిస్తే.. ప్రజలు వాస్తవాల్ని తొందరగా అర్థం చేసుకుంటారు. సంక్షేమ పథకాల్ని ఎందుకు జగన్ సర్కార్ అమలు చేస్తోందో మొన్నటి స్థానిక ఎన్నికలతోనే అందరికీ అర్థమయ్యింది. ‘మాకు ఓటెయ్యకపోతే సంక్షేమ పథకాల్ని ఎత్తేస్తాం..’ అని బెదిరించడం ద్వారా, అధికారాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవడానికి సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం, ఈ క్రమంలో ప్రజల్ని అప్పుల్లోకి నెట్టేయడం తప్ప వైఎస్ జగన్ సర్కార్, గడచిన రెండేళ్ళలో రాష్ట్ర ప్రజల్ని ఏం ఉద్ధరించిందని.?
ప్రత్యేక హోదా వచ్చిందా.? విశాఖ రైల్వే జోన్ వచ్చిందా.? ఆంధ్రపదేశ్ రాజధాని ఏది.? దుగరాజపట్నం పోర్టు ఏమయ్యింది.? కడప స్టీలు ప్లాంటు ఏమయ్యింది.? పోలవరం ప్రాజెక్టు పరిస్థితేంటి.? రాష్ట్రంలో రోడ్ల దుస్థితి ఎలా వుంది.? పొరుగు రాష్ట్రాలకు ఉపాధి కోసం ఎందుకు చదువుకున్నోళ్ళు, చదువు లేనోళ్ళు వలస పోవాల్సి వస్తోంది.? వీటికి సమాధానం చెప్పి, ఆ తర్వాత ప్రకటనల కోసం ప్రజాధనాన్ని జగన్ సర్కార్ ఖర్చు చేస్తే దానికో అర్థం వుంటుంది.