పది రూపాయల కోసం ప్రాణాలు తీసే మానవ మృగాల గురించి వింటున్నాం. కానీ, కోటి రూపాయల కోసం చచ్చిపోవాలనుకుంటున్న వారిని చూడగలమా.? ఏమో, ఎక్కడన్నా వున్నారేమో.! వారి కష్టం ఎలాంటిదో ఏమో.! కానీ, అలాంటోళ్ళు వుంటారని ఎవరూ అనుకోం. అయితే, అధికార వైఎస్సార్సీపీ మాత్రం, ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన కోటి ఎక్స్‌గ్రేషియా చూసి.. అయ్యో, మేం చచ్చిపోయినా బావుండేది.. మా కుటుంబాలకు కోటి రూపాయలు వచ్చేది..’ అనుకుంటున్నారని చెబుతోంది.
అధికార పార్టీకి చెందిన ఓ నేత, పైగా ప్రజా ప్రతినిది¸.. అధికార పార్టీకే చెందిన ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో చేసిన జుగుప్సాకరమైన, బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యల సారాంశమిది. ‘20 లక్షలు ఎక్కువ వాళ్ళకి.. అలాంటిది మా ముఖ్యమంత్రి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు’ అని ఓ మంత్రి, మనిషి ప్రాణానికి విలువ కట్టి హీనంగా మాట్లాడితే, కింది స్థాయి నేతలు ఇంకెంతగా చెలరేగిపోతారో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై అధికార పార్టీ నేతల అవాకులు చెవాకులు శృతిమించిపోతున్నాయి. నిజానికి, జరిగిన దుర్ఘటన అత్యంత బాధాకరం. అదే సమయంలో, అది పూర్తి నిర్లక్ష్యంగానే చోటు చేసుకున్న మానవ తప్పిదం. అందుకే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, తక్షణ జరీమానా కింద 50 కోట్లు చెల్లించాలని ఎల్జీ పాలిమర్స్ సంస్థను ఆదేశించింది.
మరి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది.? అది గొప్ప సంస్థ.. ఫ్యాక్టరీ నిర్వహణలో వాళ్ళకి మంచి పేరుంది.. అంటూ ముఖ్యమంత్రి కితాబులివ్వడంలోనే తెరవెనుక ‘లాలూచీ’ సుస్పష్టంగా తెలిసిపోతోంది. మనిషి ప్రాణానికి వెలకట్టే స్థాయి ఎవరికైనా వుందా.? ఛాన్సే లేదు.
పైగా, ‘మీరిచ్చే కోటి రూపాయలు మాకొద్దు.. మా బిడ్డ ప్రాణం ముందు ఈ కోటి రూపాయలు ఎక్కువేం కాదు.. మాకు న్యాయం కావాలి..’ అని బిడ్డను కోల్పోయిన తల్లి, ‘రెండు కోట్లిస్తాం.. మా కుటుంబ సభ్యుల్ని తీసుకొస్తారా.?’ అని తమ కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన బాధితులు ప్రశ్నిస్తున్న వేళ, కోటి కోసం చచ్చిపోవడానికి సిద్ధంగా వున్నారని ఓ ప్రజా ప్రతినిది¸ నిస్సిగ్గు వ్యాఖ్యలు చేయడమంటే.. వీళ్ళని రాజకీయ నాయకులు అనగలమా.? అసలు మనుషులని అనగలమా.?