ప్రతిపక్షంలో వున్నప్పుడు తాము ఏం చేసినా, అది ప్రజల కోసమేనని చెబుతుంటుంది ఏ పార్టీ అయినాసరే. ప్రశ్నిస్తాం, నిలదీస్తాం.. అంటూ బీభత్సమైన హంగామా చేయడం రాజకీయ పార్టీలకు కొత్తేమీ కాదు. చంద్రబాబు హయాంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన వీధి పోరాటాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పట్లోనూ రాజకీయ అణచివేత కన్పించింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన.
‘మేం అధికారంలోకి వస్తే, ఇలాంటి రాజకీయ అణచివేత వుండదు..’ అంటూ ప్రజలకు హామీ ఇచ్చి, గద్దెనెక్కింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అయ్యింది.. అవే వీధి పోరాటాలు.. జస్ట్ పార్టీ రంగులు మారాయంతే. అధికారంలో వున్నోళ్ళు అణచివేస్తున్నారు.. అధికారం పోయినోళ్ళు అరుస్తున్నారు. మరి, సామాన్యుల పరిస్థితేంటి.? అప్పుడూ లాఠీ దెబ్బలు తిన్నారు.. ఇప్పుడూ లాఠీ దెబ్బలు తింటున్నారు. అప్పుడూ కొట్టింది పోలీసులే.. ఇప్పుడూ కొడుతున్నది పోలీసులే.
జాబ్ క్యాలెండర్ పేరుతో ఉత్తుత్తి క్యాలెండర్ వైఎస్ జగన్ సర్కార్ విడుదల చేసిందన్నది నిరుద్యోగ లోకం చేస్తున్న ఆరోపణ. ఈ నేపథ్యంలోనే, నిరుద్యోగులు రోడ్డెక్కారు.. పోలీసులు ఆ నిరుద్యోగుల ఆందోళనల్ని అణచివేస్తున్నారు. అంతేనా, ఆ నిరుద్యోగులకు మద్దతు పలుకుతోన్న రాజకీయ నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు. అంతే కాదు, జరీమానాలూ విధిస్తున్నారు. నిరసనల్లో పాల్గొంటే 50 వేల రూపాయల జరీమానా అట. ఇదెక్కడి వింత.? అంటూ టీడీపీ ప్రశ్నిస్తోంది అధికార వైసీపీని. దీన్ని దాష్టీకం అనాలో.. ఇంకేమన్నా అనాలో అర్థం కాని పరిస్థితి.
చంద్రబాబు హయాంలో నమోదైన కేసుల్ని వైఎస్ జగన్ ప్రభుత్వం చాలావరకు ఎత్తేసింది. కొత్తగా వైఎస్ జగన్ ప్రభుత్వం కేసులు పెడుతోంది. మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వస్తే, ఆ కేసులన్నిటినీ కొట్టేయడం మామూలే. ఇవన్నీ దిక్కుమాలిన రాజకీయాలు. పోలీసు వ్యవస్థని రాజకీయ పార్టీలు ఎంత దారుణంగా వాడుకుంటున్నాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? కడుపు మండి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తారా.? అని ప్రతిపక్ష నేతగా నిలదీసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తాను అధికారంలోకి వచ్చాక, నెటిజన్లపై పెట్టిన కేసుల గురించి ఏం మాట్లాడగలుగుతారు.?
అధికారం పోతే, మళ్ళీ వైసీపీకి జనం గుర్తుకు రావడం ఖాయం. అప్పుడు మళ్ళీ, ప్రభుత్వంపై వీధి పోరాటాలు చేస్తారు. ఇదొక నిరంతర ప్రక్రియ. అందుకే, రాజకీయ వ్యవస్థలోనే మార్పు రావాలి. ఆ మార్పు రావాలంటే, ప్రజల్లో మార్పు రావాలి.