ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జలవ్యూహంలో 40 ఏళ్ల రాజకీయ అనుభవశాలి, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గల్లంతయ్యే పరిస్థితులున్నాయి. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవంలో 14 ఏళ్ల పాలనానుభవం ఉన్న చంద్రబాబుకు యువ ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలు, వ్యూహాలు అంచనాలకు అందడం లేదు. దీంతో బాబుకు దిక్కుతోచని స్థితి.
మహాభారత కురుక్షేత్రంలో అర్జునుడు తన ఎదురుగా నిలిచిన తాత భీష్ముడు, గురువులు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, ఇతర బంధుమిత్రాదులను చూసి ఆవేదనతో…రథసారధి, పాండవుల బావ అయిన శ్రీకృష్ణుడితో “ఈ యుద్ధమూ వద్దు, రాజ్యము వద్దూ, అస్త్ర సన్యాసం చేస్తా”నని కన్నీటి పర్యంతమవుతూ చెబుతాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు స్పందిస్తూ…. “అర్జునా యుద్ధం చేసేదెవరు? చేయించేదెవరు? అంతా నేనే, అన్నీ నేనే. నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివే. కర్మ చేయడం వరకే నీ వంతు. దాని ఫలితం గురించి ఆలోచించవద్దు. కావునా అర్జునా ధనస్సు చేతపట్టి యుద్ధం చేయి. శత్రుమూకలను తుద ముట్టించు” అని హితబోధ చేస్తాడు.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా తానొక శ్రీకృష్ణుడు లాంటివాడనని, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అన్నీ తానై ప్రపంచాన్ని నడిపిస్తుంటానని భ్రమలో ఉండే చంద్రబాబునాయుడు….తాజాగా జగన్ సర్కార్ జారీ చేసిన జీఓ 203పై నోరు మెదపలేని దయనీయ స్థితి. మరోవైపు తన రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం జగన్ పొరుగు రాష్ట్ర మిత్రుడైన సీఎం కేసీఆర్‌ని లెక్క చేయడం లేదనే అభిప్రాయం క్రమక్రమంగా బలపడుతోంది.
ప్రస్తుత ఈ వివాదంలో ప్రతిపక్ష టీడీపీ , జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ నోరు మెదపకపో యినప్పటికీ…. క్షేత్రస్థాయిలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు సైతం ఏపీ సర్కార్‌కు సంఘీభావం తెలుపుతున్నారు. ఒకసారి సోషల్ మీడియా చూస్తే జగన్ తీసుకున్న నిర్ణయానికి వివిధ ప్రజాసంఘాలు, పార్టీల నుంచి మద్దతు వెల్లువెత్తుడాన్ని గుర్తించవచ్చు. ఇదే సమయంలో “చంద్రబాబూ ఏ కలుగులో దాక్కున్నావయ్యా ” అంటూ సొంత మనుషులే ప్రశ్నిస్తుండటం గమనార్హం.
ఇంత రచ్చ జరుగుతుంటే…చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలతో జూమ్‌లో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఆయనపై మరింత వ్యతిరేకత పెంచేలా ఉన్నాయి. తెలంగాణ టీడీపీ నేతలతో బాబు అన్నమాటలేంటో ఒకసారి చూద్దాం…
“పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాల తరలింపు అంశంపై కేసీఆర్, జగన్ కలిసి నాటకాలు ఆడుతున్నారు. ఇంతకాలం మిత్రులం అని మాట్లాడిన జగన్, కేసీఆర్‌లు ఇప్పుడు కరోనా నియంత్రణలో విఫలమై దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే పోతిరెడ్డిపాడు అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు తీసుకునే ఏ నిర్ణయమైనా రెండు రాష్ట్రాలకు మేలు చేసేలా, అభివృద్ధికి దోహదపడేలా ఉండాలి. ఈ అంశంపై రెండు ప్రభుత్వాలు ఏ విధంగా ముందుకెళుతాయో మరో నాలుగైదు రోజులు చూసి ఒక నిర్ణయానికి వద్దాం ”
రాజకీయాలు చేసి లబ్ధి పొందడానికి బాబుకు కరోనాను వాడుకుంటున్నారని చాలా మంది అభిప్రాయం. అంతే తప్ప కరోనాని ఎదుర్కోవడంలో జగన్ విఫలమైంది ఎక్కడ? వలంటీర్ల వ్యవస్థతో ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటూ కరోనా కట్టడికి అన్ని రకాలుగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారని ఒక్క చంద్రబాబు తప్ప మిగిలిన ప్రతిపక్ష నేతలంతా అంగీకరిస్తున్నారు. దేశంలోనే అత్యధిక కరోనా పరీక్షలు చేసింది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే.
రాయలసీమ నుంచి రాజకీయంగా ఎదిగిన చంద్రబాబు తన ప్రాంత రుణాన్ని తీర్చుకోవాలని ఏనాడూ సంకల్పించలేదు. ఎందుకనో ఆయనకు రాయలసీమ అంటేనే గిట్టదు. కృష్ణా జిల్లా ఇల్లరికపు అల్లుడని పిలుపించుకోవడాన్ని బాబు ఇష్టపడతారు. పుట్టింటోళ్లు కరవుతో ఆత్మహత్యలు చేసుకుంటున్నా బాబు రాతిగుండె చలించడం లేదు. ఇదే అత్తగారి ఊరి నుంచి రాజధాని కదిలిస్తారంటే భార్యా సమేతుడై దీక్షలు, ధర్నాలు, జోలె పట్టడాలు చేస్తారు. కానీ దప్పికతో గుక్కెడు నీళ్ల కోసం దేబరిస్తున్న కరవు సీమకు, తనకు జన్మనిచ్చిన రాయలసీమకు నీటిని ఇవ్వకపోగా, ఇస్తున్న వాళ్లకు మోకాలడ్డాలనే ప్రయత్నాలను జనం జాగ్రత్తగా గమనిస్తున్నారు.
తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణలో అన్ని పార్టీలు ఏకమవుతున్న స్ఫూర్తిని తప్పనిసరిగా అభినందించాల్సిందే. ఆంధ్రప్రదేశ్ వాసిగా, తనకు రాజకీయ రాజకీయ భిక్ష పెట్టిన సీమ నుంచి అంచెలంచెలుగా సీఎం స్థాయికి ఎదిగిన నాయకుడిగా ఓ మంచి నిర్ణయానికి వెన్నుదన్నుగా నిలవాల్సిన సంక్షోభ సమయంలో, ప్రత్యర్థుల కుట్రలకు మద్దతుగా ఆ ప్రాంత టీడీపీ నాయకులతో మాట్లాడ్డం ఒక్క చంద్రబాబుకే సొంతం.
ఇదే రాయలసీమలోని కడప నుంచి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టుల నిర్మాణానికి సంకల్పించి…ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. వైఎస్ తనయుడిగా తండ్రి ఆకాంక్షలతో పాటు సీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి కరవును పారదోలేందుకు అపర భగీరథ అవతారం ఎత్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు ఇప్పుడు ఒంటరి అవుతున్నారు. రానున్న రోజుల్లో బాబు వైఖరిలో మార్పు రాకుంటే ఎలాగైతే ఆంగ్లేయులను క్విట్ ఇండియా అని దేశమంతా గళమెత్తిందో…ఇప్పుడు ఏపీలో కూడా “బాబూ క్విట్ ఆంధ్రా ” అనే రోజులు ఎంతో దూరంలో లేవనిపిస్తోంది. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీటిని అందించే పథకానికి శ్రీకారం చుట్టడం వల్ల జగన్ సర్కార్‌కు సహజంగానే మంచి పేరు వస్తుంది. ఇదే పని తన హయాంలో చంద్రబాబే చేసి ఉంటే ఈ గొడవే ఉండేది కాదు. తాను చేయడు, ఇతరుల్ని చేయించనివ్వడు అనే ధోరణి బాబులో స్పష్టంగా కనిపిస్తోంది.
జగన్ సర్కార్ ఈ నెల 5న జారీ చేసింది. దాని గురించి స్పందించేందుకు ఇంకా నాలుగు రోజులు వేచి చూద్దామని తెలంగాణ టీడీపీ నేతలతో బాబు అన్నారు. ఈ విషయమై కనీసం ఏపీ టీడీపీ నేతలతో మాట్లాడే ధైర్యం కూడా చేయలేదంటే…బాబు ఏ దుస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. పోతిరెడ్డిపాడు ఇష్యూ నుంచి బయటపడేందుకు బాబు ప్రయత్నం చేసే కొద్ది మరింత ఊబిలోకి జారుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఎందుకంటే బాబు బెంబేలెత్తడాన్ని చూసి, జగన్ సర్కార్ మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ జలవ్యూహంలో బాబు గల్లంతు కావడం ఖాయమనిపిస్తోంది. ఎందుకంటే అధైర్యపరుడిని రాజకీయం ఎంతో కాలం అంటి పెట్టుకుని ఉండదు కాబట్టి.