ఏపీకి కేంద్రం చేస్తున్న మంచి పనులపై ఎలాంటి సంకోచం లేకుండా రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. విజయవాడ వచ్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ ప్రారంభం.. 30 రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. రహదారుల విస్తరణకు వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నామని.. భూసేకరణతో పాటు అన్ని అంశాల్లో సత్వరమే నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. రహదారుల అభివృద్ధికి రూ.10,600 కోట్లు కేటాయించినట్టు వివరించారు.
ఈక్రమంలో విశాఖ బీచ్ రోడ్ నుండి భోగాపురం ఎయిర్ పోర్ట్ వరకు ఆరు లైన్ల రహదారి నిర్మాణం, విజయవాడలో కృష్ణానది మీదుగా 40కి.మి పరిధిలో వంతెనతో సహా రహదారి నిర్మాణం, కడప జిల్లా భాకరా పేట నుంచి బద్వేలు, పోరుమామిళ్ల మీదుగా ప్రకాశం జిల్లా బేస్తవారపేట రహదారి, పుంగనూరు నుంచి పులిచెర్ల మీదుగా చిన్నగొట్టిగల్లు రహదారి, సబ్బవరం నుంచి చోడవరం, నర్సీపట్నం మీదుగా తుని రహదారి, విశాఖపట్నం నుంచి నర్సీపట్నం, చింతపల్లి, చింతూరు మీదుగా భద్రాచలం వరకు ఉన్న రహదారులను అభివృద్ధి చేయాలని గడ్కరీని కోరారు.