టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ మాత్రం తన పని తాను చేసుకుపోతూ వివాదానికి తెరలేపింది. తాజాగా ఈ విషయంలో విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపానంద జోక్యం చేసుకున్నారు.
ఏపీ సీఎం జగన్, టీటీడీ ఛైర్మన్, ఈఓలతో ముచ్చటించిన పీఠాధిపతులు స్వరూపానంద టీటీడీ భూముల విక్రయం విషయంలో అన్నీ అలోచించి ఎలాంటి వివాదానికి తావులేని నిర్ణయం తీసుకోవాలని సూచించారు. టీటీడీ యాజమాన్యం తీసుకునే ప్రతి నిర్ణయం భక్తుల మనోభావాలకు కూడా ముడిపడి ఉంటుందని, లాక్ డౌన్ ముగిసి, శ్రీవారి ఆలయాన్ని తిరిగి తెరిచే సమయంలో ఇలాంటి వివాదాలకు తావులేకుండా చూసుకోవాలని స్వరూపానంద తెలిపారు.
అంతే కాకుండా ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా, అనవసరంగా విశాఖ శారదాపీఠంపై దాడికి దిగితే ఉపేక్షించమని, పలువురు హిందూ మత వ్యతిరేకులు ఇది అదునుగా తీసుకొని రాజకీయ పార్టీల ముసుగులో శారదా పీఠంపై కుట్ర పన్నుతున్నారు, వారిని అడ్డుకుంటామని స్వరూపానంద అన్నారు.