అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ రంగాలపై జరిగిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన ప్రసంగించారు. కరోనా వల్ల పోలవరం ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయన్నారు. 2021 నాటికిక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం అన్నారు.
ప్రాజెక్టు నిర్మాణాల్లో అవినీతిని అరికట్టే ఉద్దేశ్యంలోనే ఏడాది కాలంలో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.1095కోట్లు రివర్స్ టెండరింగ్ రూపంలో ఆద అయ్యాయని అన్నారు. ఈ ఏడాదిలోనే వంశధార, నాగావళి, వెలిగొండ, సంగం, అవుకు టన్నెల్ పనులు పూర్తి చేస్తామని అన్నారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ప్రాజెక్టులు నిర్మాణం చేపడుతున్నామని ఇందులో ఎవరికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు.
రాయలసీమ కరువు తీరేది పోతిరెడ్డిపాడుతోనే..
పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచితేనే రాయలసీమ కరువు తీరుతుందని సీఎం స్పష్టం చేశారు. దీనిపై వివాదాలు సృష్టించడం తగదని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ మాదిరిగానే 800 అడుగుల వద్ద నీరు ఉన్న సమయంలోనే నీళ్లు వాడుకుంటామన్నారు. 885 అడుగుల వద్ద 10 రోజులు మాత్రమే కృష్ణాకు వరద వచ్చే అవకాశం ఉందని.. అందుకే 800 అడుగుల వద్దే ప్రతిరోజు నీటిని తీసుకుంటామని అన్నారు. పోతిరెడ్డిపాడుకు నీటిని మళ్లించాలంటే శ్రీశైలంలో 885 అడుగుల మేర నీరుంటేనే సాధ్యమని.. 881 అడుగువల వద్ద ఉంటే ఉపయోగం ఉండదన్నారు. 854 అడుగుల నుంచి రోజుకు 7వేల క్యూసెక్కులను మాత్రమే ఉపయోగించుకోగలమని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరగాలన్నదే తన అభిమతమన్నారు సీఎం జగన్.
తెలంగాణ ప్రాజెక్టులన్నీ 800 అడుగుల లోపునే ఉన్నాయని గుర్తు చేశారు. 796 అడుగుల వద్ద తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోందని సీఎం గుర్తు చేశారు. టీడీపీతోపాటు కొన్ని మీడియా సంస్థలు దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంలో మిగిలిన వాటికి త్వరలో టెండర్లు పిలుస్తామని అన్నారు. ప్రాధాన్యాన్ని బట్టి రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని సీఎం అన్నారు.
వ్యవసాయ రంగంలో మార్పులు..
2021 చివరికల్లా రాష్ట్రంలో జనతా బజార్లు అందుబాటులోకి తెస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. 147 నియోజకవర్గాల్లో ల్యాబ్ లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. గ్రామస్థాయిలోనే గోదాంలు, గ్రేడింగ్, ప్యాకింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని సీఎం అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఇందుకు అగ్రికల్చరల్ అసెస్టెంట్లు చర్యలు తీసుకుంటారని అన్నారు.