ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. దానిపై హై కోర్టులో పిటిషన్ దాఖలు కావడం రివాజుగా మారింది. ఈ క్రమంలో ఆస్తుల అమ్మకాల వ్యవహరాల్లో కూడా హై కోర్టులో పిటిషన్ దాఖలు కావడం, ఈ విషయంలో ప్రభుత్వానికి హై కోర్టు సూచనలు ఏవో ఇవ్వడం, కౌంటర్ దాఖలు చేయాలని ఏజీకి ఆదేశాలు ఇవ్వడం కూడా గమనార్హం!
ప్రభుత్వం ఆస్తులు అమ్మడం అనేది ఏపీలో మాత్రమే జరిగేది కాదు. ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో అమ్మకాలకు తగిన ప్రభుత్వ స్థలాలను చూడాలని ఆదేశాలు ఇచ్చింది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోయిందని.. ఇలాంటి నేపథ్యంలో రాజధాని నగరంలోని కొన్ని స్థలాలను అమ్మి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని యడియూరప్ప ఆధ్వర్యంలోని కేబినెట్ భేటీలోనే నిర్ణయించారు!
ఇక తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో ఆస్తుల అమ్మకాల ద్వారా ఈ ఏడాదికి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలను సమీకరించుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న వైనాన్ని కూడా పరిశీలకులు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇక మోడీ ప్రభుత్వం బోలెడన్ని ఆస్తులను అమ్ముతోంది, ఆఖరికి అత్యంత లాభాల్లో ఉన్న ఎల్ఐసీలోని వాటాల అమ్మకానికి కూడా మోడీ ప్రభుత్వం రెడీ అయిపోయింది.
మోడీ ప్రభుత్వానికీ ఆస్తుల అమ్ముకునే అవకాశాలుంటాయి, దేశంలోని మరే రాష్ట్ర ప్రభుత్వాలకూ ఇలాంటి విషయంలో అడ్డుపుల్లలు లేవు! కేబినెట్ నిర్ణయం తీసుకుని అవసరాలకు తగ్గట్టుగా అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. అయితే ఏపీలో మాత్రం ఏదీ ముందుకు సాగేలా లేదు! ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం, అభ్యంతరాలు.. ఇదంతా రొటీన్ సీరియల్ గా మారింది. ఆఖరికి స్థలాలను అమ్ముకోవడం విషయంలో కూడా ప్రభుత్వం ఇప్పుడు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. మరి ఈ వ్యవహారంలో కూడా ప్రభుత్వానికి హై కోర్టు బ్రేకులు వేస్తుందా? దేశంలోని అన్ని ప్రభుత్వాలకూ ఉన్న స్వతంత్రం జగన్ ప్రభుత్వానికి ఉండబోదా? అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకం!