రాజకీయాల్లో అవినీతి వుండదని ఎవరైనా చెప్పగలరా.? ఏ పార్టీ అధికారంలో వున్నాసరే అవినీతి తప్పనిసరి. ఎందుకంటే, వ్యవస్థలో అవినీతి ఓ భాగమైపోయింది. ‘మేం అవినీతికి తావు లేని విధంగా పరిపాలిస్తాం..’ అని ఎవరు చెప్పినా అది ఈ రోజుల్లో ఓ పెద్ద జోక్. ఏ రాజకీయ పార్టీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. టీడీపీ హయాంలో రకరకాల పేర్లతో ‘ట్యాక్స్’ల గురించి విన్నాం. ‘కె’ ట్యాక్స్.. అంటూ కోడెల శివప్రసాద్‌ని ఏ స్థాయి వివాదాల్లోకి అప్పటి వైసీపీ లాగిందో చూశాం. అదొక్కటే కాదు, చాలా చోట్ల చాలామంది రాజకీయ నాయకుల పేర్లలోని అక్షరాలతో ‘ట్యాక్స్’లంటూ అవినీతిని ఎత్తి చూపింది అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
ఇప్పుడు, ఆంధ్రప్రదేశ్ అంతటా ‘జె ట్యాక్స్’ అనే పేరు మార్మోగిపోతోంది. ఇక్కడ ‘జె’ అంటే జగన్.. అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! తెలుగుదేశం పార్టీ ఈ ‘జె ట్యాక్స్’ అనే పేరుతో స్ట్రెయిట్‌గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీదనే విమర్శలు చేస్తోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజు నుంచే ఈ ‘జె ట్యాక్స్’ విమర్శలు షురూ అయ్యాయి. అయితే, అవిప్పుడు మరింత తారాస్థాయికి చేరాయి.
మరీ ముఖ్యంగా వైఎస్ జగన్ ఏడాది పాలన పూర్తి చేసుకున్నాక, ‘జె ట్యాక్స్’ అనే పదాన్ని వాడటం పెంచింది టీడీపీ. ‘జె టర్న్.. జె ట్యాక్స్..’ అనే పేర్లతో వైఎస్ జగన్ పాలనను తీవ్ర స్థాయిలో విమర్శిస్తోన్న టీడీపీ, ఈ క్రమంలో కొంతమేర విజయం సాధించినట్లే కన్పిస్తోంది. సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణులే కాకుండా, ఇతరులు కూడా ఇప్పుడు ‘జె ట్యాక్స్’ అంటూ.. స్పందించడం మొదలుపెట్టారు.
ఇసుక వ్యవహారాలు, ప్రాజెక్టుల్లోంచి నీళ్ళ దొంగతనాలు, ఇళ్ళ స్థలాల పేర్లతో వసూళ్ళు.. సంక్షేమ పథకాల విషయంలో చేతి వాటం.. ఇలాంటి అన్ని అంశాల్నీ ఈ ‘జె ట్యాక్స్’ పరిధిలోకి తెచ్చేస్తూ అధికార పక్షంపై విమర్శలు చేస్తున్నారు వైసీపీ యేతర పార్టీల నేతలు, మద్దతుదారులు. అయితే, ఈ తరహా దుష్ప్రచారంతో తమకు వచ్చిన నష్టమేమీ లేదని వైఎస్సార్సీపీ చెబుతోంది.
పైకి అలా చెబుతున్నా, లోలోపల ‘జె ట్యాక్స్’ ప్రచారం ‘కొంప ముంచుతోంది’ అనే భావన మాత్రం వైసీపీ నేతల్లో వుందన్నది నిర్వివాదాంశం. గ్రౌండ్ లెవల్‌లో కొందరు చేసే తప్పిదాలు పార్టీకి నష్టం చేస్తున్నాయంటూ.. వైసీపీలోనే కొందరు నేతలు, ఈ ‘జె ట్యాక్స్’ వ్యవహారాలపై ఆఫ్ ది రికార్డ్‌గా మీడియాకి ఉప్పందిస్తుండడం కొసమెరుపు.