Advertisement

ఏపీ పాలిటిక్స్… ఎంతగా మారిపోయిందంటే?

Posted : June 12, 2020 at 3:44 pm IST by ManaTeluguMovies

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆది నుంచి వినూత్నమేనని చెప్పాలి. తెలుగు నేల విభజన తర్వాత 13 జిల్లాలతో కొత్త ప్రయాణం ప్రారభించిన ఏపీలో తొలి ఐదేళ్ల పాటు టీడీపీ అధికారం సాగించగా.. తాజాగా ఏడాది క్రితం వైసీపీ అధికార పార్టీగా మారిపోయింది. టీడీపీ హయాంలో కొనసాగిన రాజకీయం ఇప్పుడు మచ్చుకు కూడా కనిపించడం లేదు.

అధికార వైసీపీ అవలంబిస్తున్న కొత్త పంథాతో నిజంగానే ఇప్పుడు ఏపీలో రాజకీయం పూర్తిగా మారిపోయిందని చెప్పక తప్పదు. తనదైన శైలి దూకుడును కనబరుస్తోన్న వైసీపీ… ఊహించని పరిణామాలతో భారీ ఎదురు దెబ్బలు తింటోంది. అయినా కూడా తన పంథాను మార్చుకోవడానికి ససేమిరా అంటున్న వైసీపీ వైఖరితో ఇప్పుడు నిజంగానే ఏపీలో రాజకీయం సాంతం మారిపోయిందని చెప్పక తప్పదు.

2014 ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ… ఏపీలో పాలనా పగ్గాలు చేపట్టగానే కొంత కాలం పాటు రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించినట్టు కనిపించినా… ఆ తర్వాత జన్మభూమి కమిటీలు, రాజధాని అమరావతి అంటూ జపం చేయడం మొదలెట్టింది. అంతేకాకుండా ఏపీకి జీవనాడిగా పరిగణించిన జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణాన్ని అడిగి మరీ తీసుకుని అభాసుపాలైపోయింది.

రాష్ట్రంలో విపక్షమన్నదే ఉండరాదన్న దిశగా సాగిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి మూల్యం చెల్లించుకున్నారు. ఈ క్రమంలో 2014ఎన్నికల్లో తన వెన్నంటి సాగి తన విజయానికి దోహదపడిన బీజేేపీ, జనసేనలు క్రమంగా టీడీపీకి దూరమైపోయాయి. ఫలితంగా 2019 ఎన్నికల్లో మూడు పార్టీలు మూడు ముక్కలాట ఆడగా… అప్పటికే జనాల్లో మంచి మైలేజీ సాధించిన వైసీపీ ఘన విజయం సాధించింది.

తాజాగా విపక్షంలో ఉండగా.. లెక్కలేనన్ని ఆదర్శాలు వల్లించిన వైసీపీ అధికారంలోకి రాగానే.. వాటన్నింటినీ పక్కనపెట్టేసిందనే చెప్పాలి. విపక్షంలో ఉండగా.. పార్టీ ఫిరాయింపులపై తనదైన శైలి ఆదర్శాలు చెప్పిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… అధికారంలోకి రాగానే… అవే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను తన వైపునకు లాగేసిన జగన్.. మాజీ మంత్రి శిద్ధా రాఘవరావును కూడా లాగేశారు.

ఈ పరిణామాలపై జనం విస్మయం వ్యక్తం చేస్తున్న వైైనం చాలా స్పష్టంగానే కనిపిస్తోంది. అదే సమయంలో పేద ప్రజల సంక్షేమం కోసమంటూ జగన్ తీసుకుంటున్న దాదాపుగా అన్ని కీలక నిర్ణయాలన్నీ కూడా విదాదాస్పదంగానే మారిపోయాయి. ఇటు హైకోర్టుతో పాటు అటు సుప్రీంకోర్టు కూడా జగన్ సర్కారు నిర్ణయాలపై ఎప్పటికప్పుడు మొట్టికాయలు వేస్తుండటం కూడా చర్చనీయాంశంగా మారిపోయింది.

మొత్తంగా సీఎం హోదాలో జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై ప్రజా వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపిస్తున్న తరుణంలో ఎన్నికల సమయంలో ఎవరికి వారే యమునా తీరే అన్న విపక్షాలన్ని ఇప్పుడు ఒక్క దరికి చేరిపోతున్నాయి. సర్కారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉమ్మడి పోరుకు కూడా అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అయితే దానికి ఇంకా సమయం పట్టొచ్చు.

ఈ క్రమంలో టీడీపీ ఆధ్వర్యంలో బీజేపీ సహా విపక్షాలన్నీ కూడా ఏకమైతే… 2024 నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోతాయన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. విపక్షంలో ఉండగా వైరి వర్గాలపై దూకుడుగా సాగిన జగన్ ఇప్పుడు అసలు వైరి వర్గాల గురించి పెద్దగా పట్టించుకోనట్లు కనిపిస్తున్న తీరు కూడా విపక్షాల బలోపేతానికి దారి తీస్తోందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.


Advertisement

Recent Random Post:

Diwali Festivities in RGV DEN: Lights, Laughter, and Traditions

Posted : November 2, 2024 at 3:09 pm IST by ManaTeluguMovies

Diwali Festivities in RGV DEN: Lights, Laughter, and Traditions

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad