‘కృష్ణా రివర్ బోర్డ్’ కార్యాలయాన్ని విజయవాడకు తరలించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారట..
ఇరు రాష్ట్రాల మధ్యా సఖ్యత కోసం కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ పనిచేస్తోంది.. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఇరు రాష్ట్రాలూ తమ వాదనలు వినిపించాయి..
ఇలా కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ ప్రకటించారో లేదో.. అలా తెలంగాణ నుంచి కౌంటర్ వచ్చి పడింది. నిజానికి, ‘వైఎస్ జగన్ దెబ్బకి దిగొచ్చిన కేసీఆర్’ అంటూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారుగానీ.. ఆ పరిస్థితి వుంటుందా.? అన్న అనుమానాలైతే చాలామందిలో వున్నాయి.
తెలంగాణ రాష్ట్ర నినాదంలోనే ‘నీళ్ళు, నిధులు’ అనే ప్రస్తావన వుంది. పోతిరెడ్డిపాడు వివాదం నుంచి తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న విషయం విదితమే. ఆ పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచేలా వైఎస్ జగన్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది. ఇక్కడే కేసీఆర్‌కీ, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికీ మధ్య ‘వైరం’ షురూ అయ్యింది. ఇదిప్పుడు ముదిరి పాకాన పడింది.
‘పోతిరెడ్డిపాడు విషయంలో వెనక్కి తగ్గకపోతే.. అలంపూర్ వద్ద మేం భారీ ప్రాజెక్ట్ చేపడతాం.. రోజుకి 3 టీఎంసీల నీళ్ళు ఎత్తి పోసేస్తాం..’ అంటూ వైఎస్ జగన్ ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు కేసీఆర్. కాగా, జలశక్తి మంత్రి.. పలు అంశాల్లో కేసీఆర్ వాదనను సమర్థించారనీ, వైఎస్ జగన్ ప్రభుత్వానికి మొట్టికాయలేశారనే ప్రచారం తెలంగాణ నుంచి గట్టిగా జరుగుతోంది.
కొన్నాళ్ళ క్రితం గోదావరి నీటిని తోడుకుని.. వాడుకుందామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదిస్తే, అందుకు కొంత సానుకూలంగా స్పందించిన వైఎస్ జగన్.. పూర్తిస్థాయిలో ‘సై’ అనలేదు. ఒకవేళ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కి వుంటే పరిస్థితి ఏంటి.? ఏదిఏమైనా.. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం వీలైనంత త్వరగా సమసిపోవాల్సి వుంటుంది.
వేరే రాష్ట్రాల మధ్య నీటి సమస్యలు వేరు. మహారాష్ట్ర, కర్నాటకతో తెలంగాణ ప్రభుత్వం నీటి వివాదాల్ని పరిష్కరించుకుంది. కానీ, ఆంధ్రప్రదేశ్‌తోనే పంచాయితీ తెగడంలేదు. చంద్రబాబుతో కేసీఆర్ వైరం వేరు. వైఎస్ జగన్‌తో కేసీఆర్ పంచాయితీ వేరు. అంతిమంగా.. తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సహృద్భావం కొనసాగితే అందరికీ మంచిదే. అదే తేడా వస్తే మాత్రం.. పరిస్థితులు ఇంకోలా వుంటాయి. ఆర్టీసీ బస్సుల విషయంలోనే సమస్య కొలిక్కిరానప్పుడు, నీటి వివాదాలు అంత త్వరగా ఎలా కొలిక్కి వస్తాయ్.?