‘ఢిల్లీ పెద్దల మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తాం..’ అంటూ 2019 ఎన్నికల ముందు వైసీపీ చాలా ప్రగల్భాలు పలికింది. ఆ మాటకొస్తే, రాష్ట్రంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ ప్రత్యేక హోదా విషయమై పబ్లిసిటీ స్టంట్లు చేశాయి, చేస్తూనే వున్నాయి కూడా.! మిగతా పార్టీలతో పోల్చితే, ప్రస్తుతం ప్రత్యేక హోదా బాధ్యత అధికార వైసీపీ మీద ఎక్కువగా వుంది. ఎందుకంటే, 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదాని ‘ఎన్నికల ఎజెండా’గా మార్చిన ఘనత తమదేనని వైసీపీ చెప్పుకుంది గనుక.
మరి, కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ మెడలు వంచే ప్రక్రియను వైసీపీ ఎంతవరకు ప్రారంభించిందట.? ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఢిల్లీకి వెళ్ళారు.. ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ప్రధానికి ఈ అంశాలపై రిప్రెజెంటేషన్ ఇచ్చానంటూ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్, మీడియా ముందుకు రాలేకపోయారు.
రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానికి ముఖ్యమంత్రి వివరించడం జరిగింది.. అని వైసీపీ నేతలు చెప్పడం.. మామూలే అనుకోండి.. అది వేరే విషయం. నిజానికి, వైసీపీ అధికారంలోకి వచ్చాక, ప్రత్యేక హోదా అంశాన్ని కాలగర్భంలో కలిపేసిందన్నది నిర్వివాదాంశం. ‘కేంద్రంలో బీజేపీ పూర్తి బలంతో వుంది. ఈ పరిస్థితుల్లో కేంద్రాన్ని అడగడం తప్ప, శాసించలేం..’ అని గతంలోనే చేతులెత్తేశారు వైఎస్ జగన్.
కానీ, ఎన్డీయేలో వైసీపీ చేరబోతోందన్న ప్రచారం దరిమిలా, వైఎస్సార్సీపీ.. కేంద్రం మీద ప్రత్యేక హోదాపై ఒత్తిడి తీసుకురావాలి కదా.? జీఎస్టీ బకాయిలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విద్యుత్ సంస్కరణలు, రాజ్యసభలో పలు బిల్లుల సందర్భంగా ఎదురైన అవకాశాలు.. ఇలా ఏ సందర్భంలోనూ వైసీపీ, ప్రత్యేక హోదా అంశాన్ని బలంగా ముందుకు తీసుకురాలేకపోయింది.
ప్రత్యేక హోదా పేరుతో వైసీపీ రాష్ట్ర ప్రజల్ని వంచించిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? ‘కేంద్రం మెడలు వంచడం కాదు.. కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద మెడలు వంచేసుకుని, అధికార వైసీపీ.. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తోంది..’ అన్న విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.