ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మళ్ళీ ఢిల్లీకి వెళ్ళబోతున్నారట. ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్ కోసం వైఎస్ జగన్ ఎదురుచూస్తున్నారనీ, అపాయింట్‌మెంట్ కుదరగానే ఆయన ఢిల్లీకి వెళతారనీ ప్రచారం జరుగుతోంది. వచ్చే వారంలోనే ఈ టూర్ వుండబోతోందన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.
కొద్ది రోజుల క్రితమే వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్ళారు.. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ‘రాష్ట్రానికి సంబంధించి కేంద్రం విడుదల చేయాల్సిన నిధులు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి..’ అని వైసీపీ చెబుతోంది. కానీ, ఎన్డీయేలో చేరే దిశగానే వైఎస్ జగన్, ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారన్నది మీడియా, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం.
వైసీపీకి బీజేపీ మూడు కేంద్ర మంత్రి పదవులు ఆఫర్ చేసిందనీ, వైసీపీ మాత్రం, ప్రత్యేక హోదాని డిమాండ్ చేస్తోందనీ వైసీపీ అనుకూల మీడియా కథనాల్ని వండి వడ్డిస్తోంది. ఈ ‘పంపకాల’ నేపథ్యంలోనే వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్ళబోతున్నారన్న ప్రచారం గట్టిగా జరుగుతున్న దరిమిలా, వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ మరోమారు పొలిటికల్ హీట్ పెంచుతోంది.
ఇదిలా వుంటే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల ఢిల్లీకి వెళ్ళొచ్చాక రాష్ట్రంలో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి వైసీపీ ఎంపీ రఘురామరాజుకి సంబందించిన వ్యాపార కార్యకలాపాలపై సీబీఐ సోదాలు. రెండోది, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డేకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫిర్యాదు. ఈ రెండిటికీ ఢిల్లీ పెద్దల నుంచి వైఎస్ జగన్ ‘అనుమతి పొందారు’ అన్న చర్చ ఓ పక్క గట్టిగా జరుగుతోంది.
ఆ రెండు విషయాలపై మరోమారు ప్రధానికి నివేదించడంతోపాటు, మరికొన్ని కీలకమైన అంశాలను తన వెంట పెట్టుకుని వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్ళబోతున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి ప్రధానిని కలవడం అనేది సర్వసాధారణమైన విషయం.
అయితే, చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడుగానీ, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడుగానీ.. ప్రత్యేక హోదా వంటి కీలక అంశాలే ఎజెండాగా ఢిల్లీ పర్యటనలు జరగకపోవడాన్ని రాష్ట్ర ప్రజానీకం ఆక్షేపిస్తున్నారు.
Share