సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డేకి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఫిర్యాదు చేసిన వ్యవహారంలో ఆసక్తికరమైన ట్విస్ట్ చోటు చేసుకుంది. వైఎస్ జగన్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ సునీల్ కుమార్ సింగ్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు సర్వోన్నత న్యాయస్థానంలో.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోన్న ప్రతి నిర్ణయానికీ అడ్డుపడటం వెనుక, టీడీపీ అధినేత చంద్రబాబుకీ జస్టిస్ ఎన్వీ రమణకీ వున్న సన్నిహిత సంబంధాలే కారణమనీ, చంద్రబాబుతో సంబంధాల నేపథ్యంలో జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టులోని న్యాయమూర్తులపై ఒత్తిడి తెస్తున్నారనీ వైఎస్ జగన్, సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తికి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే, ఈ పిటిషన్ వ్యవహారాల్ని మీడియా ముందు బహిర్గత పరిచి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్నది న్యాయవాది సునీల్ కుమార్ సింగ్ ఆరోపణ. ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కి రాసిన లేఖ వివరాల్ని ఇటీవల మీడియా ముందు వెల్లడించిన విషయం విదితమే.
లేఖ రాయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని తప్పు పట్టలేమనీ, అయితే ఆ లేఖ వివరాల్ని ఆయన మీడియా ద్వారా బహిర్గతం చేయడం అనేది కోర్టు ధిక్కరణ కింద వచ్చే అవకాశం వుందని న్యాయ నిపుణుడు మాడభూషి శ్రీధర్, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో చర్చ సందర్భంగా వ్యాఖ్యానించిన విషయం విదితమే.
కాగా, ‘హైకోర్టు తీర్పులు ప్రభావితమవుతున్నాయి..’ అని సాక్షాత్తూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడమంటే, అది హైకోర్టు న్యాయమూర్తులకు దురుద్దేశ్యాలు ఆపాదించినట్లేననీ, పలువురు న్యాయమూర్తుల పేర్లను ప్రస్తావించిన దరిమిలా, వైఎస్ జగన్.. తన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపించని పక్షంలో పరిణామాలు తీవ్రంగా వుంటాయన్న భావన న్యాయ కోవిదుల నుంచి వ్యక్తమవుతున్నాయి.