రాష్ట్రంలో కొత్తగా 53 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనే మూడు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. వీటికి అదనంగా 53 కొత్త కార్పొరేషన్లతో కలిసి మొత్తంగా 56 బీసీ కార్పొరేషన్లు అవుతున్నాయి. ఈ నెల 18న బీసీ కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించనుంది. ఈ కార్పొరేషన్లకు సంబంధించిన పోస్టుల్లో 50 శాతం పైగా మహిళలకే ప్రాధాన్యతనిస్తామన్నది ప్రభుత్వం చెబుతున్న మాట.
ఇంతకీ, ఈ కార్పొరేషన్లతో ఆయా సామాజిక వర్గాలకు కొత్తగా జరిగే ‘న్యాయం’ ఏమైనా వుంటుందా.? అన్నదే ఇక్కడ కీలకమైన ప్రశ్న. గతంలో ‘కాపు కార్పొరేషన్’ పేరుతో నానా హంగామా జరిగింది. అయితే, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల్ని.. ఆయా సామాజిక వర్గాల పేరుతో విడివిడిగా పబ్లిసిటీ చేసుకోవడానికే ఈ కార్పొరేషన్లు తప్ప, వీటితో కొత్తగా ఆయా సామాజిక వర్గాలకు కలిగే అదనపు ప్రయోజనమేమీ వుండదన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.
పైగా, ఆయా కార్పొరేషన్లకు సంబంధించి నామినేటెడ్ పోస్టులుంటాయి. ఇవన్నీ ‘రాజకీయ నిరుద్యోగుల పునరావాస పథకం’ కింద భర్తీ అవుతాయన్న విమర్శలున్నాయి. ఇది ఉత్త విమర్శ కానే కాదు.. వాస్తవం.! గతంలో వివిధ కార్పొరేషన్లకు సంబంధించి ‘కీలక పోస్టులు’ ఎలా భర్తీ అయ్యాయో, ఆ భర్తీ ప్రక్రియ చుట్టూ ఎన్ని వివాదాలు తలెత్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడూ అదే జరగబోతోంది.
కార్పొరేషన్ల ప్రకటనతో.. ఆయా ప్రకటలకయ్యే ఖర్చు దండగ వ్యవహారం తప్ప, ఆయా సామాజిక వర్గాలకు అదనంగా ఒక్క పైసా అయినా ప్రయోజనం జరుగుతుందా.? అన్న ప్రశ్నకు అధికార పార్టీ నేతలే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇంకో చిత్రమేంటంటే, రాజకీయ ప్రయోజనాల కోసం ఆయా కార్పొరేషన్లకు నిధుల్ని కేటాయించినా, వాటిని సద్వినియోగం చేయకపోవడమో, వేరే అవసరాల కోసం ఆయా కార్పొరేషన్ల నిధుల్ని వెచ్చించడమో చూస్తూనే వున్నాం.
ఓ పక్క ‘కుల మత బేధాల్లేని సమాజం కోసం..’ అంటూనే కార్పొరేషన్ల పేరుతో, కుల.. మత.. రాజకీయాలు చేయడం అధికారంలో వున్నవారికి సర్వసాధారణమైపోయింది. కొసమెరుపేంటంటే, ఈ కార్పొరేషన్ల ప్రకటన కొన్నాళ్ళ క్రితమే జరగాల్సి వుంది. ఆయా కార్పొరేషన్లకు సంబంధించి కీలక పదవులు తమకే దక్కాయంటూ కొందరు ప్రచారం చేసేసుకున్నారు.. వారిని అభినందిస్తూ ఆయా కుల సంఘాలు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టేసుకోవడం కొసమెరుపు.