పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీకి కేంద్రం షాక్ ఇవ్వబోతోందా.. అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. సవరించిన డీపీఆర్‌ను ఆమోదించాలంటూ ఏపీ ప్రభుత్వం కోరుతుంటే.. పాత అంచనా వ్యయాన్ని మాత్రమే ఆమోదిస్తామని కేంద్రం అంటోందని వార్తలు వస్తున్నాయి. పాత అంచనాలు, ఇప్పటివరకూ ఏపీకి ఇచ్చిన నిధుల్ని లెక్కేసి.. ఇంకా ఇవ్వాల్సింది 4,819.47 కోట్లు మాత్రమే అని చెప్తోందట. దీనిపై ఏపీ ప్రభుత్వం ఆమోదం తీసుకోవాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని కేంద్రం ఆదేశించినట్లు తెలుస్తోంది.
దీంతో సీఎం జగన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. కేంద్రం విధానంపై, నిధుల విషయంపై మంత్రులు, ఇరిగేషన్ అధికారులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పాల్గొన్నారు. ప్రస్తుత పరిణామాలపై ఏ విధంగా ముందుకెళ్లాలో చర్చించినట్టు సమాచారం. రెండు రోజుల క్రితం రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. సీఎం జగన్ ఈ అంశంపైనే ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది.
పోలవరం ప్రాజెక్ట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులను.. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను త్వరితగతిన విడుదల చేయాలని మంత్రి బుగ్గన విజ్ఞప్తి చేశారు. అయితే కేంద్రం పాత అంచనాల ఆధారంగానే నిధులు విడుదల చేస్తామని అంటోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా ముందుకెళ్తుందో చూడాలి.