కరోనా వైరస్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యం సుస్పష్టం. ఈ సందట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, ‘జగనన్న విద్యా దీవెన’ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించారు. విద్యార్థులకు ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్ కల్పించడం, ఆ సొమ్ముని స్వయంగా విద్యార్థి తల్లి ఖాతాలోకి జమ చేయడం ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశ్యం.
విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి విభాగాల్లో ప్రభుత్వాలు ఎంత ఎక్కువ చేసినా, ఇంకా ఇంకా చేయాల్సింది చాలానే వుంటుంది. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఈ ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్ తెరపైకొచ్చింది. ఆ తర్వాత అది ఆయన హయాంలోనే పబ్లిసిటీ స్టంట్‌గా మారిపోయింది. వైఎస్ మరణానంతరం ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్ మరింత నవ్వులపాలైపోవడానికి కారణాలు చాలానే వున్నాయి. ఫీజు-రీఎంబర్స్‌మెంట్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు వింత వింత షరతులు విధించడం విద్యార్థుల పాలిట వేధింపులకు కారణమయ్యిందన్నది నిర్వివాదాంశం. చంద్రబాబు హయాంలోనూ నానా యాగీ జరిగింది.
మరోపక్క, ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్ పుణ్యమా అని ప్రైవేటు విద్యా సంస్థలు బాగుపడ్తున్నాయనీ, నాణ్యమైన విద్య మాత్రం అందడంలేదన్న విమర్శలూ లేకపోలేదు. ఆ మాటకొస్తే, అది నిజం కూడా. చాలామంది రాజకీయ నాయకులు విద్యని వ్యాపారంగా మలచుకుని, తద్వారా వచ్చిన సంపాదనతో రాజకీయాలు చేస్తున్నారంటే.. వారికి ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్ ఎంతటి మేలు చేసిందో అర్థం చేసుకోవచ్చు.
గతాన్ని పక్కన పెడితే, ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్ బాకీలు తీర్చేస్తూ.. కొత్తగా పెద్దయెత్తున నిధులు విడుదల చేసినట్లు వైఎస్ జగన్ ప్రభుత్వం చెబుతోంది. ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్ విషయంలో లోటుపాట్లు వుండబోవని చెబుతోంది. మొత్తం ఫీజుని రీ-ఎంబర్స్ చేస్తామనీ అంటోంది. అలా జరిగితే మంచిదే. కానీ, గతంలోలా మళ్ళీ ఇది పబ్లిసిటీ స్టంట్‌గా మారితేనే కష్టం.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందినప్పుడే ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్ పథకం విజయవంతమైనట్టు లెక్క. అంతే తప్ప, ఇదేదో ప్రైవేటు విద్యా సంస్థల్ని ఉద్ధరించడానికే అయితే.. అంతకన్నా దారుణం ఇంకొకటి వుండదు.