వైఎస్సార్.. ఆ పేరు చెబితే ఓట్లు వస్తాయ్.. అందుకే వైఎస్సార్ జపం చేస్తున్నారు వైసీపీ నేతలు. అధినేత వైఎస్ జగన్ సహా వైసీపీ ముఖ్య నేతలందరి తీరూ ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల వేళ వైఎస్సార్ పేరు వివాదాస్పదంగా ప్రస్తావనకు వస్తోంది వివిధ పార్టీలకు చెందిన నేతల కారణంగా. ‘పావురాల గుట్టలో మాయమైపోయిన పావురం’ అని ఒకాయిన విమర్శిస్తాడు.. ‘కేసీఆర్ పోతాడన్నోళ్ళే పోయారు..’ అని ఇంకొకాయన అంటాడు.
‘తెలంగాణలో చిచ్చు రేపాలని చూశాడు.. తెలంగాణ రాష్ట్ర సమితిని నాశనం చేద్దామనుకుని, నాశనమైపోయాడు..’ అని మరో పొలిటీషియన్, పరోక్షంగా విమర్శలు చేస్తాడు. ప్రతిసారీ వైఎస్సార్ అభిమానులే కాస్తో కూస్తో ఆ వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు.. ఈ క్రమంలో బీజేపీ నేత రఘునందన్, వైఎస్సార్‌సపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణ కూడా చెప్పారు. కానీ, వైసీపీ నేతలు ఎందుకు ఈ విషయమై స్పందించడంలేదు.?
నిజానికి, తన తండ్రి మరణంపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తున్న నేతలపై స్వయానా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి విరుచుకుపడాలి. కానీ, అలా జరగడంలేదు. వైసీపీలో చాలామంది ముఖ్య నేతలున్నాయి. కొందరైతే ట్విట్టర్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా వుంటారుగానీ, అలాంటి నేతలూ వైఎస్సార్ మరణంపై జరుగుతున్న రచ్చపై స్పందించకపోవడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చాక, కొన్ని సంక్షేమ పథకాలకు వైఎస్సార్ పేరు పెట్టడం మినహా, వైఎస్సార్‌కి తగిన గౌరటవం ఇవ్వడంలేదన్న విమర్శలున్నాయి. ఇక, వైఎస్సార్‌పై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నవారిలో టీఆర్‌ఎస్, బీజేపీ నేతలే ఎక్కువ. అయితే, ఇటు టీఆర్‌ఎస్‌నిగానీ, అటు బీజేపీనిగానీ గట్టిగా నిలదీయలేని పరిస్థితి వైసీపీ నేతలది.
అఫ్‌కోర్స్, వైఎస్సార్‌ని ఎవరైతే గట్టిగా తిట్టారో, అలాంటివారికే పిలిచి మరీ పదవులిచ్చారు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. ఈ లిస్ట్‌లో బొత్స సత్యనారాయణ సహా పలువురు సీనియర్ పొలిటీషియన్స్ వుంటారు. వాళ్ళెవరికీ వైఎస్సార్ పట్ల తగిన గౌరవం లేకపోవడం వల్లనే, వైఎస్సార్ మీద ఇతరులు విమర్శలు చేస్తోంటే, పట్టించుకోవడంలేదని వైఎస్సార్ అభిమానులు వాపోతున్నారు.
‘చంద్రబాబు, స్వర్గీయ ఎన్టీఆర్‌ని బతికుండానే రాజకీయంగా వెన్నుపోటు పొడిచారు.. వైఎస్సార్ చనిపోయాక.. ఆయన్ని వైసీపీ నేతలు వెన్నుపోటు పొడుస్తున్నారు.. అలాంటివారిని ఉపేక్షించడమంటే ఇది కూడా వెన్నుపోటులాంటిదే’ అన్న చర్చ వైఎస్సార్ అభిమానుల్లో జరుగుతోంది. ఏరు దాటాక తెప్ప తగలేయడమంటే ఇదేనా.?