‘షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారా.? మీకెవరు చెప్పారు.?’ అంటూ అమాయకంగా ప్రశ్నంచేశారు ఓ వైసీపీ నేత, అదీ వైఎస్ షర్మిల, హైదరాబాద్ లోటస్ పాండ్ వేదికగా కొత్త రాజకీయ పార్టీ గురించిన ప్రకటన చేసిన తర్వాత కూడా. ‘మా అన్న నుంచి నాకు పూర్తి సహకారం వుంది’ అని షర్మిల చెబితే, ‘వైసీపీ తరఫున షర్మిలకు ఎలాంటి రాజకీయ సహకారం వుండదు..’ అని తేల్చేశారు వైసీపీకే చెందిన మరో ముఖ్య నేత. ‘పార్టీ పెట్టాలని ఆమె అనుకున్న మాట వాస్తవం. అయితే, ఆ నిర్ణయాన్ని జగన్ సహా మేమంతా వ్యతిరేకించాం. కానీ, ఆమె మా మాట వినలేదు..’ అని వైసీపీ ముఖ్య నేత సజ్జల రామక్రిష్ణారెడ్డి ప్రకటించిన సంగతి తెల్సిందే.
ఇదిలా వుంటే, వైసీపీ అనుకూల మీడియాలో అప్పటిదాకా షర్మిలకు సంబంధించి ఎలాంటి వార్తా రాలేదు. ఆ తర్వాత కూడా ఏదో మమ అన్పించేశారు. ఏమయ్యిందో, షర్మిలకు సంబంధించిన వార్తలు వైసీపీ అనుకూల మీడియాలో ఇప్పుడిప్పుడే కాస్త జోరుగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన ప్రాంతాలకు చెందిన ప్రజలు, నాయకులతో షర్మిల ఆత్మీయ సమావేశం నిర్వహించబోతున్నారట. ఇదొక కీలక ఘట్టమని వైసీపీ అనుకూల మీడియా అంటోంది.
నిజానికి వైసీపీ – షర్మిల వేర్వేరు కాదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవ్వాలంటూ.. షర్మిల పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. అలాంటిది, తన సోదరి కొత్త రాజకీయ పార్టీ పెడుతోందని తెలిసి.. కనీసం స్పందించలేకపోయారు వైఎస్ జగన్. జగన్ కోసం షర్మిల సుదీర్ఘ పాదయాత్ర చేశారు. అలాంటప్పుడు, కనీసం తన మీడియా ద్వారా అయినా షర్మిలకు వైఎస్ జగన్ సహాయ సహకారాలు అందించాలి కదా.?
విశ్వసనీయత, వంకాయ.. అంటూ ఏవేవో కథలు చెప్పడం కాదు, షర్మిలకు ఎందుకు సహకరించట్లేదో సమాధానం చెప్పాలంటూ రాజకీయ ప్రత్యర్థులు నిలదీస్తున్నా వైఎస్ జగన్ మాత్రం మౌనం దాల్చుతున్నారు. ప్రస్తుతానికి వైసీపీ అనుకూల మీడియాలో షర్మిల వార్తలకు ప్రాధాన్యత దక్కుతోంది.
ఏమో, ముందు ముందు బాహాటంగానే వైఎస్ జగన్ తన సోదరి షర్మిలకు రాజకీయంగా అండదండలు అందించనున్నట్లు ప్రకటిస్తారేమో.. లేదంటే, వైసీపీ తరఫునే తెలంగాణలో ఆమె బాధ్యతలు నిర్వహించేలా అవకాశం కల్పిస్తారేమో. అదే జరిగితే, ఇప్పటిదాకా షర్మిలతో రాజకీయ సంబంధాలేం లేవు.. అని పాచి కబుర్లు చెబుతున్న సోకాల్డ్ వైసీపీ నేతల పరిస్థితి ఏంటట.?