‘పాదయాత్ర’ అంటే గుర్తొచ్చేది దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరే. తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వీరిద్దరూ పాదయాత్ర తర్వాత ముఖ్యమంత్రులు అయ్యారనేది వాస్తవం. ఇప్పుడు తండ్రి, అన్నయ్య బాటలోనే నడవనున్నారు వైఎస్ షర్మిల. ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో ఆమె పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈమేరకు వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అధికారికంగా ప్రకటించారు.
అక్టోబర్ 20 నుంచి ఈ పాదయాత్ర ప్రారంభించనున్నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తన పాదయాత్ర ఉంటుందన్నారు షర్మిల. తండ్రి బాటలోనే పాదయాత్రను చేవెళ్లలో ప్రారంభించి చేవెళ్లలోనే ముగిస్తానని.. రోజుకు 12-15 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. ప్రతి మంగళవారం తాను చేపడుతున్న నిరాహార దీక్షను పాదయాత్రలోనూ కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
నిరుద్యోగ సమస్య పరిష్కారమయ్యే వరకు పాదయాత్ర కొనసాగిస్తామని అన్నారు. ‘పాదయాత్రకు వైఎస్‌ఆర్ బ్రాండ్ అంబాసిడర్. ఆయన ఆశయాలు సాధించేందుకే పాదయాత్ర చేయాలని సంకల్పించాను’ అని షర్మిల తెలిపారు.