ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న సంకల్పసభలో పాల్గొనేందుకు దివంగత మాజీ సీఎం వైఎస్సార్ కుమార్తె షర్మిల భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ నుంచి ఖమ్మం బయలుదేరారు. తెలంగాణ యవనికపై పెట్టబోయే పార్టీ గురించి ప్రకటన చేయడం కోసం శుక్రవారం ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్ లో సాయంత్రం 5 గంటలకు సంకల్ప సభ నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనడం కోసం ఉదయం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నుంచి షర్మిల భారీ కాన్వాయ్ తో బయలుదేరారు. పంజగుట్టలోని వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఖమ్మం బయలుదేరారు.
మార్గమధ్యంలో ఎనిమిది ప్రాంతాల్లో షర్మిలకు భారీ స్వాగతం పలకనున్నారు. మధ్యాహ్నం సూర్యాపేటలో భోజనం చేసిన తర్వాత కూసుమంచిలో షర్మిలకు ఖమ్మం జిల్లా నేతలు స్వాగతం పలుకుతారు. అక్కడ నుంచి ర్యాలీగా సభ జరిగే ప్రాంతానికి వెళ్తారు. ఈ సభలో షర్మిలతోపాటు ఆమె తల్లి, వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పాల్గొంటారు. తల్లిగా కుమార్తెను ఆశీర్వదించడానికి ఆమె వస్తున్నట్టు షర్మిల అనుచర నేతలు తెలిపారు.