‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తాం’’ – ఇదీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పే విషయం.
అమ్మ ఒడి ప్రారంభించినప్పుడూ, రైతుభరోసా డబ్బులు వేసినప్పుడు కూడా లబ్ధిదారుల ఎంపిక గురించి ఆయన ఇదే సంగతి చెప్పారు. తాజాగా రాష్ట్రంలో అర్హులైన వ్యక్తులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక సాగుతోంది. వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులను గుర్తిస్తున్నారు. అయితే, ఈ వ్యవహారంలో కొన్నిచోట్ల అధికార పార్టీ నేతల జోక్యం పెరుగుతోంది. తమకు కావాల్సినవారికే ఇళ్ల స్థలాలు వచ్చేలా చేసేందుకు పలువురు స్థానిక నేతలు చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నయానో భయానో వాలంటీర్లను తమ దారికి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని అంటున్నారు. అలా కుదరనిచోట్ల వాలంటీర్ల సంతకాలు పోర్జరీ కూడా చేయడం చర్చనీయాంశమైంది. ప్రకాశం జిల్లాలో ఇద్దరు వాలంటీర్లు తమ సంతకాలు ఫోర్జరీ చేసి లబ్ధిదారుల జాబితా మార్చేశారని ఆరోపిస్తూ రెవెన్యూ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రకాశం జిల్లా కోడిగుడ్లపాడులో ఓ వాలంటీర్ 60 మందితో కూడి లబ్ధిదారుల జాబితాను అధికారులకు అందజేయగా.. అనంతరం అది పూర్తిగా మారిపోయిందని సదరు వాలంటీర్ గుర్తించాడు. 22 మంది పేర్లతో కూడిన జాబితాను రూపొందించి దానిపై అతడి సంతకం ఫోర్జరీ చేసినట్టు తెలుసుకుని అవాక్కయ్యాడు. వెంటనే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ నిర్వహిస్తున్న మేధోమథనంలో జగన్ మాట్లాడుతూ.. వాలంటీర్లపై ప్రశంసలు కురిపించారు. అవినీతి అనేదే అంటని వ్యవస్థ అని కొనియాడారు. ఇంతవరకు బాగానే ఉంది.. ఆ వ్యవస్థలో స్థానిక నేతల జోక్యం కూడా లేనప్పుడే జగన్ చెబుతున్నవన్నీ నిఖార్సుగా జరుగుతాయి.