విలక్షణ నటుడు కమల్ హాసన్.. వరుస చిత్రాలతో సందడి చేయనున్నారు. జూన్ 27వ తేదీన కల్కి చిత్రంతో రానున్నారు. అక్కడికి కొన్ని రోజులకే భారతీయుడు-2 మూవీ రిలీజ్ కానుంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 28 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమా చేశారు కమల్. అయితే ఈ మూవీ షూటింగ్ అప్పుడెప్పుడో మొదలై ఇటీవల పూర్తి చేసుకుంది. ఎట్టకేలకు జూన్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ సహా పలువురు నటిస్తున్న ఇండియన్-2 సినిమా మ్యూజిక్ ఆల్బమ్ ను ఇటీవల రిలీజ్ చేశారు మేకర్స్. చెన్నైలో గ్రాండ్ గా కొన్ని రోజుల క్రితం ఆడియో లాంఛ్ ఈవెంట్ ను నిర్వహించారు. అయితే ఇండియన్-1కు ఏఆర్ రెహమాన్ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇండియన్ 2 చిత్రానికి మాత్రం కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ బాణీలు కట్టారు.
అయితే ఇండియన్-2 సాంగ్స్.. మ్యూజిక్ లవర్స్ నుంచి మిక్స్ డ్ రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ మూవీ కోసం అనిరుధ్, శంకర్ తొలిసారి వర్క్ చేశారు. ఇప్పుడు చాలా మంది ఇండియన్ 2 సాంగ్స్ ను రెహమాన్ ఐకానిక్ కంపోజిషన్ లతో కంపేర్ చేసి కామెంట్లు పెడుతున్నారు. భారతీయుడు పాటల్లా ఆకట్టుకోవడం లేదని చెబుతున్నారు. పారా, నీలోర్ఫమ్ సాంగ్స్ డీసెంట్ గా ఉన్నప్పటికీ.. మిగతా పాటలు అంతగా నచ్చలేదని అంటున్నారు. ఇంకొందరు శంకర్ సినిమాల్లో ఆయన మ్యూజిక్ లెగసీ మిస్ అవుతుందని అభ్రిప్రాయపడుతున్నారు.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీలోని జరగండి సాంగ్ ను గుర్తుచేస్తున్నారు. ఇండియన్-2కు అదిరిపోయే రీతిలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వాలని అనిరుధ్ కు సూచిస్తున్నారు. ఇంకొందరు అనిరుధ్, రెహమాన్ ఎప్పటికీ ఒకటి కాలేరని కామెంట్ చేస్తున్నారు. పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ కాకముందే తన సినిమా పాటలతో మ్యాజిక్ క్రియేట్ చేశారు శంకర్. కానీ ఇండియన్-2 మూవీ సాంగ్స్ తో అనుకున్నంత స్థాయిలో మాత్రం బజ్ క్రియేట్ చేయలేకపోయారు.
అయితే మ్యూజిక్ ప్లేయింగ్ ప్లాట్ ఫామ్ స్పాటిఫైలో ఇండియన్-2 ఆల్బమ్ కు 9 లక్షలకుపైగా స్ట్రీమ్స్ వచ్చాయి. 2024లో హైయెస్ట్ స్ట్రీమ్స్ అందుకున్న సినిమాగా ఇండియన్ -2 నిలిచింది. ఐట్యూన్స్ ఇండియాలో నంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకుంది. తమిళ జ్యూక్ బాక్స్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. మ్యూజిక్ సంగతి పక్కన పెడితే.. సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.