త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయిత నుండి దర్శకుడిగా మారిన విషయం తెల్సిందే. మాటల మాంత్రికుడు అన్న పేరుని సార్ధకం చేసుకుని ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. కెరీర్ లో ఒకట్రెండు సినిమాలు తప్పితే త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సినిమాలు ఏవీ కూడా గురి తప్పింది లేదు. రీసెంట్ గా అల వైకుంఠపురములో చిత్రంతో టాప్ గేర్ లోకి వెళ్ళిపోయాడు.
ఈ సినిమా సూపర్ సక్సెస్ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు సమాయత్తమవుతున్నాడు. ఈ సినిమా జూన్ నుండి షూటింగ్ అని ముందు అనుకున్నారు కానీ ఇప్పుడు కరోనా వల్ల మిగతా సినిమాల షూటింగ్స్ ఆలస్యమవుతుండడంతో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా మొదలవ్వడానికి కూడా ఆలస్యమవుతుంది.
ఈలోగా లాక్ డౌన్ పీరియడ్ ను త్రివిక్రమ్ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఈ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక డైలాగ్ వెర్షన్ పై మరికొన్ని రోజుల్లో తన టీమ్ తో కలిసి కూర్చోనున్నాడు త్రివిక్రమ్.
ఇదిలా ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ పై సరికొత్త రూమర్ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కొడుకుని హీరోగా లాంచ్ చేయడానికి ఈ మాటల మాంత్రికుడు ఎస్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇది సాదాసీదా బడ్జెట్ లో కాకుండా దాదాపు 100 కోట్లతో బహుళ భాషల్లో తెరకెక్కించాలని భావిస్తున్నారట. దీనికోసం త్రివిక్రమ్ కూడా బాగానే డిమాండ్ చేస్తున్నాడని తెలుస్తోంది.
అయితే ఈ వార్త నిజమా కాదా అన్నది తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.