తన వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారని, తప్పైందని…క్షమించాలని ట్విటర్ వేదికగా ప్రముఖ యాంకర్ రష్మి వేడుకున్నారు. రాజమండ్రిలో శుక్రవారం ఆమె ఓ స్టోర్ ప్రారంభానికి వచ్చారు. పెద్ద సంఖ్యలో జనం గుమికూడారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో…జాగ్రత్తలు తీసుకునే చర్యల్లో భాగంగా పోలీసులు వాళ్లందరినీ అక్కడి నుంచి తరిమేశారు.
అంతకు ముందు ట్విటర్లో తాను రాజమండ్రిలో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు స్టోర్‌ను ప్రారంభించేందుకు వస్తున్నట్టు పోస్ట్ పెట్టారు. దీంతో నెటిజన్లు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో పబ్లిక్ కార్యక్రమాలు ఏంటని, ప్రభుత్వం అనుమతి ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. ఒకవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకచోట జనం గుంపులుగా కలవకూడదనే ఉద్దేశంతో విద్యాసంస్థలకు సెలవులు కూడా ప్రకటించాయన్నారు. అలాగే ఇంటి నుంచి విధులు నిర్వర్తించే వెసులుబాటు చూసుకోవాలని సూచించాయని గుర్తు చేశారు.
అయినా అనుకున్న ప్రకారమే రష్మి స్టోర్ ప్రారంభానికి అక్కడికి వెళ్లారు. వందలాది మంది గుమికూడారు.
కార్యక్రమం అనంతరం ట్విటర్ లైవ్‌లో రష్మి మాట్లాడారు. తన వల్ల ఇబ్బంది పడిన వారికి క్షమాపణలు చెప్పారు. అధికసంఖ్యలో ప్రజలు రావాలని అనుకోలేదని, కరోనా నేపథ్యంలో ఎవరూ రారని అనుకున్నట్టు తెలిపారు. కానీ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమ ఒప్పందం చాలా రోజుల కిందట చేసుకుందన్నారు. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చిందన్నారు.
అంతేకాకుండా ప్రభుత్వం నుంచి కూడా అనుమతి రావడంతో మరో ఆలోచన చేయలేదన్నారు. అయితే కరోనాపై అందరూ అవగాహనకు రావాలని, ప్రాణాలు ముఖ్యమని, ప్రభుత్వాలు చెబుతున్న జాగ్రత్తలు పాటించాలని రష్మి పాఠాలు చెప్పడం గమనార్హం.