మెగాస్టార్-మెగాపవర్ స్టార్ ఇద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న సినిమా ఆచార్య. దీనికి కొరటాల శివ దర్శకుడు. ఈ సినిమాను ఎలాగైనా ఆగస్టు 14న విడుదల చేయాలన్నది మెగాస్టార్ చిరంజీవి సంకల్పం. ఇది ఎప్పుడో ముందుగా అనుకున్న డేట్. కానీ అదేంటో కానీ ఏదో ఒక సమస్య వస్తూనే వుంది. అడ్డం పడుతూనే వుంది.
ఆర్ ఆర్ ఆర్ వాయిదా పడడంతో తొలి సమస్య వచ్చింది. దాంతో రామ్ చరణ్ ను వదిలి, మహేష్ బాబును తీసుకోవాలా? అని కిందా మీదా పడ్డారు. ఆ తకరారు తీరి, రామ్ చరణ్ నే అని దాదాపు ఫిక్స్ అయ్యారు. రాజమౌళిని ఒప్పించి ఆగస్టులో విడుదల చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇంతలో హీరోయిన్ త్రిష్ ప్రాజెక్టు నుంచి జంప్ అయింది. ఇప్పుడు మరో హీరోయిన్ కావాలి. ఆమె డేట్లు మరెవరితోనూ క్లాష్ కాకూడదు.
ఆ సమస్య అలా వుండగానే కరోనా వ్యవహారం వచ్చింది. ఎలాగూ హీరోయిన్ లేదు అని షూటింగ్ వాయిదా వేసారు. ఇలాంటి నేపథ్యంలో ఆగస్టులో ఆచార్య విడుదల ఇక వుండదని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో ఆగస్టు 14 డేట్ ను తమ తమ సినిమాలకు ఫిక్స్ చేసుకుంటే ఎలా వుంటుందని మరి కొన్ని బ్యానర్లు ఆలోచిస్తున్నాయి.
కరోనా వ్యవహారం మరికాస్త జటిలమై, సినిమాలు ఇప్పుడే రెడీ కాకపోతే, వకీల్ సాబ్ ను కూడా వెనక్కు జరపకతప్పదు. అవసరం అయితే ఈ డేట్ ను పరిశీలించాలని కూడా అనుకుంటున్నారు.