సమస్త మానవాళిని వణికిస్తున్న కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ పాట్లు పడుతున్నాయి. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి అందరూ కలిసికట్టుగా ఉండాలని పలువురు ప్రముఖులు పిలుపునిస్తూనే ఉన్నారు. మన దేశానికి వస్తే.. ప్రస్తుతం ఈ వైరస్ విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనిని అరికట్టడానికి రాష్ట్రాలు కిందా మీదా పడుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి మెరుగ్గా ఉండగా.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం భయంకరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఏపీ నేతలు రాజకీయాలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అధికార పక్షంపై ప్రతిపక్షాలు, ప్రతిపక్షాలపై అధికార పక్షం తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నాయి. వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టే దిశగా చర్యలు తీసుకోకుండా రాజకీయపరమైన అంశాలకే రెండు పక్షాలు ప్రాధాన్యత ఇవ్వడంపై పలువురు మండిపడుతున్నారు. ఈ విషయంలో విపక్షాలు ప్రభుత్వానికి అండగా ఉండకపోయినా పర్లేదు.. రాజకీయాలు చేయకుండా ఉంటే చాలని అంటున్నారు. అలాగే అధికార పక్షం కూడా విపక్షాలపై చౌకబారు విమర్శలు చేయకుండా కరోనా కట్టడికి కృషి చేయాలని సూచిస్తున్నారు. ఈ విషయంలో కేరళను చూసి చాలా నేర్చుకోవాలని పేర్కొంటున్నారు.
కరోనాను కట్టడి చేయడంలో కేరళ అనుసరించిన విధానాలు చాలా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా అలర్ట్ రాగానే ముందుగా స్పందించిన కేరళ.. వెంటనే తగిన చర్యలు చేపట్టింది. రూ.20వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రతిపక్ష నేతతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారంటే ఆయన ఎంతటి పరిణితి చెందిన నాయకుడో అర్థం చేసుకోవచ్చు.
ఇలాంటి సంఘటనను మన తెలుగు రాష్ట్రాల్లో కనీసం ఊహించుకునే పరిస్థితి కూడా ఉండదు. ఏపీలో అయితే అధికార, విపక్షాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం చూస్తుంటే.. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ నేతలు మారరా అని అనిపించక మానదు. ప్రధాని మోదీ సైతం విపక్ష నేతల అభిప్రాయాలు తీసుకుని ముందుకెళ్తున్నారు. వివిధ పక్షాల నేతలు సైతం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా నిర్మాణాత్మక సూచనలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కావాల్సింది ఇదే. కానీ తెలంగాణ, ఏపీల్లో దీనిని ఊహించే సాహసం కూడా చేయలేం.
తెలంగాణలో కేసుల సంఖ్య బాగా తగ్గింది. త్వరలోనే ఒక్క పాజిటివ్ కేసు కూడా లేని రాష్ట్రంగా తెలంగాణ మారనుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ ఏపీలో మాత్రం కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రోజుకు కనీసం 80 కేసులు నమోవుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 1259కి చేరింది. ఈ నేపథ్యంలో అక్కడ ఈ వైరస్ కట్టడికి ప్రభుత్వం మరింత గట్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.