సామాజిక సమస్యలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా నటి రేణు దేశాయ్ స్పందిస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో ఆమె అవగాహన కల్పిస్తుంటారు. మరీ ముఖ్యంగా మహిళలపై హింసను ఆమె తీవ్ర స్థాయిలో నిరసిస్తూ ఉంటారు. తన అభిప్రాయాలను ఎలాంటి భయం లేకుండా నేరుగా చెబుతారని ఆమెకు పేరు. లాక్‌డౌన్ వేళ కొంత మంది కట్టు తప్పుతున్నారని ఆమె ఆవేదన చెందుతున్నారు. లాక్‌డౌన్ ఉద్దేశాన్ని గుర్తించాలని ఆమె కోరుకుంటున్నారు. లాక్‌డౌన్ మన రక్షణ కోసం, మన కుటుంబం, మన పిల్లల కోసమని ఆమె హితవు పలుకుతున్నారు.
లాక్‌డౌన్ వేళ తన అభిప్రాయాలను ఆమె వెల్లడించారు. జనాన్ని చైతన్యపరిచేలా ఆమె విన్నపాలున్నాయి. రేణు మాటల్లో ఆవేదన, వేడుకోలు, ఆగ్రహం…అన్నీ ఉన్నాయి. ఇంతకూ ఆమె ఏమంటున్నారంటే…
‘ ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కానీ తప్పదు.. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టండి. ఇంట్లోనే ఉండండి. నేను నా బాల్కనీ నుంచి చూస్తున్నాను. చాలా మంది బయట తిరుగుతున్నారు. బస్‌లు కనిపిస్తున్నాయి. టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ అన్నీ తిరుగుతూనే ఉన్నాయి. ఈ లాక్‌డౌన్ మన రక్షణ కోసం, మన కుటుంబ రక్షణ కోసం.. మన పిల్లల కోసం. దయచేసి ఇంట్లోనే కూర్చోండి. బయటికి వెళ్లవద్దు. ఒక్కసారి అనుకుంటే ఏదైనా చేయగలం’ అంటూ ఆమె ప్రజల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. కరోనా వేళ దేశభక్తిని రగిల్చేందుకు మనసును కదిలించే మాటలతో ముందుకొచ్చారు.
‘ పనులు మానుకుని ఇంట్లో కూర్చోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. కానీ ఇది మనకోసమే అని అందరూ భావించండి. ఒకవేళ బయటికి వెళితే.. ఎవరికి కరోనా వైరస్ ఉందో, ఎవరికి లేదో తెలియదు. ఒకవేళ వైరస్ సోకిన వ్యక్తికి మీరు దగ్గరవడం వల్ల మీకు కూడా ఆ వైరస్ అంటుకుంటుంది. మీ ద్వారా మీ ఇంటిలోని వారికి.. ఇలా వ్యాప్తి చెందుతుంది. ఇది చాలా ప్రమాదం. ఇది రిలాక్స్ టైమ్ అనుకుని పాజిటివ్ థింకింగ్‌ని ఏర్పరచుకోండి. మీ మీద మీకు నమ్మకం ఏర్పరచుకోండి’ అని రేణు దేశాయ్ తన సందేశంలో పేర్కొన్నారు.
రేణు మాటల్లో ప్రజలపై ప్రేమ కనిపిస్తోంది. ఆమె మాటల్లో నిజాయితీ ఉంది. అన్నిటికీ మించి ప్రజల ప్రాణాలకు ఏమవుతుందోననే ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. మన కోసం ఆలోచించే వాళ్ల మాటలను ఆలకించాల్సిన అవసరం ఎందైనా ఉందని జనం గ్రహిస్తే మంచిది.