ఎన్నికల హామీ మేరకు నవరత్నాల్ని అమలు చేస్తున్నామని అంటోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ, రాష్ట్ర ప్రజలకు చాలా చాలా అతి ముఖ్యమైన హామీలు ఇచ్చి మాట తప్పింది వైఎస్సార్సీపీ. సరిగ్గా రెండేళ్ళ క్రితం ఇదే రోజున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది.. ఫలితాలు రెండేళ్ళ క్రితం ఇదే రోజు వచ్చాయ్ మరి. కనీ వినీ ఎరుగని విజయమిది.. 175 అసెంబ్లీ స్థానాల్లో 151 స్థానాలు గెలవడమంటే మాటలు కాదు. కానీ, గెలిచి వైసీపీ ఏం సాధించింది.?
మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడం.. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సహా పలువుర్ని అరెస్ట్ చేయడం.. చంద్రబాబు సహా చాలామందిపై కేసులు పెట్టడం తప్ప.. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ముఖ్యమైన విషయాల్ని పట్టించుకున్న దాఖలాలేమైనా వున్నాయా.?
‘మేం గెలిస్తే, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాం..’ అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ఏదీ ప్రత్యేక హోదా.? రాజీనామాలతోనే ప్రత్యేక హోదా సాధ్యమని ప్రతిపక్షంలో వుండగా అన్నారు.. అధికార పీఠమెక్కాక.. అలాంటి రాజీనామాస్త్రాలు ఏమయిపోయాయ్.?
ప్రత్యేక హోదా సంగతి పక్కన పెడదాం.. రాష్ట్ర రాజధాని మాటేమిటి.? ఏళ్ళు గడుస్తున్నాయ్.. రాష్ట్రానికి రాజధాని వుందో లేదో తెలియని పరిస్థితి. ‘మేం అమరావతిని అభివృద్ధి చేస్తాం.. రాజధానిని మార్చబోం..’ అని ఎన్నికల ప్రచారంలో చెప్పిన వైసీపీ, అమరావతిలో రాజధాని అవసరం లేదని చెబుతోందిప్పుడు. దాన్ని ఎడారిగా అభివర్ణిస్తారు.. స్మశానంగా అమరావతిని పేర్కొంటారు.. ఇదీ వైసీపీ గత రెండేళ్ళలో రాష్ట్రానికి వెలగబెట్టిన ఘనత.
పోనీ, పోలవరం ప్రాజెక్టు అయినా పూర్తయ్యిందా.? అంటే అదీ లేదు. గేట్లు పెట్టేస్తున్నాం.. స్పిల్ వే మీద స్లాబ్ వేసేస్తున్నాం.. అని చెప్పుకోవడం తప్ప, పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం నుంచి రావాల్సిన స్థాయిలో నిధులు మాత్రం రప్పించలేకపోతున్నారు. ముంపు పునరావాసంపై ఇంకా సమస్య కొలిక్కి రాలేదు. కడప స్టీలు ప్లాంటు రాలేదు సరికదా, విశాఖ స్టీలు ప్లాంటు అగమ్య గోచరంగా తయారైంది. పోర్టుల పరిస్థితీ అంతే.
గడచిన రెండేళ్ళలో రాష్ట్రాన్ని కొత్తగా వైసీపీ ఉద్ధరించిందేంటట.? ఏమీ లేదుగానీ.. ప్రత్యర్థుల మీద కక్ష సాధింపు చర్యలు మాత్రం కనీ వినీ ఎరుగని రీతిలో వుంటున్నాయి. దాదాపుగా ప్రతి కేసులోనూ కోర్టు మొట్టికాయలే.. కోర్టు ధిక్కరణ వ్యవహారాలు ఎప్పటికప్పుడు వెలుగు చూస్తూనే వున్నాయి. చివరికి దొంగ ఓటర్లను తీసుకొచ్చి ప్రజాస్వామ్యానికి అసహాస్యం చేసే స్థాయికి దిగజారిపోయింది రాష్ట్ర రాజకీయం. విలువల పతనంలో మాత్రం అత్యద్భుతమైన ప్రగతి సాధించేసింది వైసీపీ.. గత రెండేళ్ళలో. ఇంతకంటే రాజకీయాల్లో పతనం.. అనేది ఇంకేమీ వుండబోదేమో.