ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవడం అంటే ఇదే. ప్రపంచంలో ప్రతి ఒక్కరి చూపు అమెరికాపైనే ఉంటుంది. అక్కడే ఉండిపోవాలని, ఉద్యోగం చేసుకోవాలని ఆఖరికి… అవకాశం దొరికితే కనీసం ఓ సారి వెళ్లి రావాలని అయినా చాలామంది తపిస్తుంటారు.
అయితే అమెరికన్లు ఏమనుకుంటున్నారు? ప‌్రస్తుతం కరోనా కలకలంతో అమెరికా మొత్తం లాక్ డౌన్లోకి వెళ్లిపోయిన తరుణంలో వారి ఫీలింగ్ ఏంటో తెలిస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు. తమ మాతృదేశమైన అమెరికా కంటే…భారతదేశమే ఎంతో మేలని వారు ఫీలవుతున్నారు.
ఔను. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా రాకపోకలు రద్దు కావడం, ఒకదేశం నుండి మరో దేశానికి వెళ్లే ప్రయాణికులు ఎక్కడికక్కడ ఆగిపోవడం తెలిసిన సంగతే. విదేశాల నుండి విహార యాత్రలకు వచ్చిన వారు సైతం ఇందులో కొందరున్నారు. అలా భారత్‌లో ఉండిపోయిన అమెరికన్లలో కొందరు సంచలన విషయాలు పంచుకున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇతర దేశాల్లో ఉన్న మొత్తం 50 వేల మంది అమెరికన్లను స్వదేశం తీసుకు వెళ్ళడానికి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయించడం, ఇందులో భారత్‌లో ఉన్న వారిని కూడా స్వదేశానికి రావాలని సూచించడం తెలిసిన సంగతే.
మనదేశంలో ప్రస్తుతం మొత్తం 800 మంది అమెరికన్లు ఉండగా వారిలో కేవలం 11 మంది మాత్రమే అమెరికా వెళ్ళడానికి ముందుకు వచ్చారు. మిగతా వారంతా తమ దేశం వెల్లేందుకు ఇష్టపడలేదు.
అత్యంత ఆసక్తికరంగా అమెరికన్లు తమ దేశం వెళ్లేందుకు ఎందుకు నో చెప్పారంటే..అమెరికాలో కరోనా ఉగ్రరూపం దాల్చడమే. అక్కడ ఇప్పటికే మొత్తం 5లక్షల పైగా కేసులు నమోదు కాగా 22 వేలకు పైగా మరణాలు సంభవించాయి.
భారత్ లో కరోనా కేసులు ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువ ఉండటంతో అమెరికన్లు ఇక్కడే ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఇదిలాఉండగా, తాజాగా భారత్‌లో ఉన్న 400 మంది ఆస్ట్రేలియా దేశస్థులను ఆ దేశం ప్రత్యేక విమానంలో తీసుకుపోయింది.