తెలుగు తెరపై విరిసిన నిండు చందమామ అనుష్క .. తెలుగు ప్రేక్షకుల మనసు మైదానంలో పరచుకున్న పండు వెన్నెల అనుష్క. చక్కని కనుముక్కుతీరుతో అప్సరసలు అసూయపడేలా చేసే అందం అనుష్క సొంతం. అందమైన ఆమె అభినయానికి ఇప్పుడు పదహారేళ్లు. అవును కథానాయికగా ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చేసి అప్పుడే 16 ఏళ్లు అయింది. సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో విభిన్నమైన .. విశేషమైన పాత్రలను పోషిస్తూ వచ్చింది. నాయిక ప్రధానమైన పాత్ర చేయాలంటే అనుష్క తరువాతనే ఎవరైనా అనిపించుకుంది.
అనుష్క పోషించిన నాయిక ప్రధానమైన పాత్రలు గల సినిమాలు స్టార్ హీరోల సినిమాలతో సమానమైన వసూళ్లను రాబట్టాయి. ‘అరుంధతి’ .. ‘రుద్రమదేవి’ .. ‘భాగమతి’ వంటి నాయిక ప్రధానమైన సినిమాలు అసమానమైన ఆమె నటనకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తాయి. ఆ తరువాత వచ్చిన ‘నిశ్శబ్దం’ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఆ తరువాత ఆమె కాస్త విరామమే తీసుకుంది. దాంతో ఇక అనుష్క సినిమాలు మానేసినట్టేననే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే నాయిక ప్రధానమైన ఒక సినిమాను ఆమె చేయనున్నట్టుగా రీసెంట్ గా ఒక ప్రకటన వచ్చింది. ఈ విషయాన్ని ఆమె కూడా ధృవీకరించింది.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ సినిమాకి మహేశ్.పి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. ” ఈ కథ రాస్తున్నప్పుడు అనుష్కను అనుకోలేదు .. బౌండ్ స్క్రిప్ట్ పూర్తయిన తరువాత అనుష్క అయితే బాగుటుందని అనుకున్నాను. ఆమెకి కథ చెబితే ఓకే అన్నారు. ఆ తరువాత కథలో నేను కొన్ని మార్పులు చేశాను. కానీ ఆమె అంతకుముందు ఉన్నట్టుగానే ఉంచమనీ .. అందులోని స్ట్రాంగ్ పాయింట్ తనకి నచ్చిందని చెప్పారు. ఆ తరువాత ఆమె కొన్ని ఇన్ పుట్స్ ఇచ్చారు. అవి ఆమెకి గల అనుభవానికి అద్దం పట్టాయి. ఆమెకి స్క్రిప్ట్స్ పై ఎంత కమాండ్ ఉందనే విషయాన్ని స్పష్టం చేశాయి” అని చెప్పుకొచ్చాడు.