అనుభవం అయితే కానీ తత్వం బోధపడదు. అధికారాంతమందు చూడవలె అని వెనకటికి పెద్దల మాట. టాలీవుడ్ లో అన్నీ ఆర్ధిక సంబంధాలే కానీ మానవ సంబంధాలు వుండవు అన్నది పరమసత్యం. ఇవన్నీ ఇప్పుడు ఒకప్పటి నిర్మాత బండ్ల గణేష్ కు పూర్తిగా అనుభవంలోకి వచ్చేసాయి.
ఎవర్నీ వదలకుండా వెంటాడుతున్న కరోనా, ఏ లక్షణం చూపించకుండానే బండ్ల గణేష్ కు కూడా వచ్చేసింది. ఈ వార్త దాగకుండా బయటకు వచ్చేసింది. సహజంగా మనకు తెలిసిన మనిషికి బాగాలేదు అంటే కనీసం ఓ ఫోన్ చేసి, ఎలా వుంది, జాగ్రత్త అని అడగడం సహజం. ఇక సినిమా జనాలైతే ఫోన్ మునివేళ్ల మీదే వుంటుంది కాబట్టి, ట్వీట్టర్ లో తెగ ప్రేమలు కురిపిస్తుంటారు. పుట్టిన రోజైనా, చీమ చిటుక్కుమన్నా, హీరోల పిల్లలు ..మామ్మా..తాతా అన్నా, అబ్బ, ఎంత ముద్దుగా అంటున్నారొ, కచ్చితంగా వీడు హీరో అయిపోతాడు అంటూ ట్వీట్ లు వేసేస్తుంటారు.
అలాంటిది బండ్ల గణేష్ కు ఒక్కరంటే ఒక్క హీరో ఫోన్ చేసి కానీ, ట్వీటు వేసి కానీ పలకరించిన పాపాన పోలేదు. ఎన్టీఆర్ తో రెండు సినిమాలు, పవన్ కళ్యాణ్ తో రెండు సినిమాలు, రామ్ చరణ్ తో ఒకటి, బన్నీతో ఒకటి, రవితేజతో ఒకటి సినిమాలు చేసాడు. ఎక్కడి ప్రతి స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ నా దేవుడు..నా దేవుడు అని గొంతు చించుకున్నాడు. సినిమా చేసిన ప్రతి హీరోకి భక్తుడిగా మారి భజన చేసాడు.
సరే ఆర్థిక లావాదేవీలు, గడబిడలు ఏవొ వుంటే వుండొచ్చు. వున్నాయో, లేవో అన్నది వాళ్లకే తెలియాలి. అంత మాత్రం చేత కరోనా టైమ్ లో కష్టంలో వున్న మనిషిని పరామర్శించడం అన్నది మనిషి బాధ్యత. కానీ బండ్ల గణేష్ కు అలాంటి పరామర్శలే దక్కలేదన్నది బోగట్టా.
డైరక్టర్ మారుతి, పరుశురామ్ లాంటి ఒకరిద్దరు. కేవిపి, బొత్స సత్యనారాయణ లాంటి రాజకీయనాయకులు, ఓ ఛానెల్ అధిపతి తప్ప ఒక్క హీరో కానీ, అతగాడి సినిమాల్లో వేషాలు వేసిన నటులు కానీ, డైరక్టర్లు కానీ పలకరించిన పాపాన పోలేదని తెలుస్తోంది. దీనికి ఇదంతా బండ్ల స్వయంకృతం అని కొందరు సమర్థిస్తున్నారు. మనిషి ఎలాంటి వాడయినా, ఏం చేసినా, కష్టం వచ్చినపుడు పలకరించాలి కదా? అని కొందరు అంటున్నారు.
అయినా ఇది ‘చిత్ర’ సీమ, ఇంట్లో హీరో వుంటేనే, లేదా ఆ ఇంట్లో వాళ్లతో అవసరం వుంటే మాత్రమే, అలాంటి ఇంట్లో ఎవరైనా చనిపోయినా, బాగా లేకపోయినా, మరేం జరిగినా కార్లు క్యూ కడతాయి. లేదూ అంటే బాడీని చూడడానికి వచ్చేవారు కూడా వుండరు. అంతేగా..అంతేగా..