సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ స్థాయిని ఈరోజు మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ తో దూసుకుపోతున్నాడు దేవి. తాజాగా తను స్వరపరిచిన ఉప్పెన చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో దేవి మాట్లాడుతూ బాలు గారి ప్రస్తావన తీసుకొచ్చారు. ఇటీవలే విడుదలైన రంగులద్దుకున్న పాట బాలు గారు విని ఉంటే కచ్చితంగా తనను అభినందించి ఉండే వారని, అందుకే ఆ పాటను ఆయనకు అంకితమిచ్చానని తెలిపాడు దేవి.
తన తండ్రి మరణం తర్వాత తనను అత్యంత ఎక్కువగా బాలు గారి మరణం కలచి వేసిందని తెలిపారు. బాలు, ఇళయరాజా తాను ఎక్కువగా ఇష్టపడే ఇద్దరు వ్యక్తులని, వీరిద్దరూ లేకపోతే సంగీతం లేదని తాను భావిస్తానని దేవి అన్నారు.
ఉప్పెన సినిమాలో బాలు గారితో ఒక పాట పాడించాలనుకున్నాను. కానీ అది సాధ్యపడలేదు. అలాగే నాన్నకు ప్రేమతో సాంగ్ ను ఆయన స్టూడియోలో ఆయనతో రికార్డ్ చేయాలని భావించాం. బాలు గారికి నా సాంగ్స్ లో ఎక్కువగా నచ్చిన పాట అది. కానీ కరోనా వల్ల లాక్ డౌన్ కారణంగా అది సాధ్యపడలేదు, ఈలోగా ఆ మహానుభావుడు వెళ్లిపోయారు అని దేవి తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు.