‘‘జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా నన్ను ఆ పార్టీలోకి ఆహ్వానించారు. ఫుల్ టైమ్ రాజకీయాలు చేయాలనే ఉద్యోగం వదులుకుని రాజకీయాల్లోకి రావడం జరిగింది. అయితే, జనసేన అధినేత.. అనూహ్యంగా మళ్ళీ సినిమాల్లో నటించాలనుకున్నారు. అందుకే, ఆయనతో విబేదించి పార్టీ నుంచి బయటకు వచ్చాను..’’ అంటూ మరో మారు మనసులో మాట బయపెట్టారు జనసేన మాజీ నేత, సీబీఐ మాజీ జేడీ వివి లక్ష్మినారాయణ.
అయితే, జనసేన పార్టీని నడపడానికి, తన కుటుంబం నడవడానికి, తనను నమ్ముకున్నవారి కుటుంబాలు నడవడానికి అవసరమైన మేర సంపాదన తప్పనిసరి అనీ.. అందుకే తాను సినిమాల్ని ఎంచుకున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.
సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పినా.. ప్రత్యేక పరిస్థితులు పవన్‌ని మళ్ళీ సినిమాల వైపు మళ్ళించాయి. సినిమాల్లో ఓ వైపు నటిస్తూ, ఇంకో వైపు పార్టీ కార్యకలాపాలు చూసుకుంటూ జనసేన అధినేత పడుతున్న కష్టమేంటో అటు పార్టీ శ్రేణులకీ తెలుసు, ఇటు పవన్ కళ్యాణ్‌తో సినిమాలు చేస్తోన్న దర్శక నిర్మాతలకీ తెలుసు. అందుకే, జెడి లక్ష్మినారాయణ నిర్ణయాన్ని చాలామంది ‘సిల్లీ డెసిషన్’గా కొట్టిపారేస్తున్నారు.
అయితే, జెడి లక్ష్మినారాయణ మాత్రం తనది సీరియస్ డెసిషన్ అంటున్నారు. ‘చాలా ఆలోచించే ఆ నిర్ణయం తీసుకున్నాను’ అని చెబుతున్నారాయన. ఓ సీనియర్ జర్నలిస్ట్, ‘నేను దాన్ని సిల్లీ రీజన్ అని అనలేనుగానీ..’ అంటూనే, జెడి లక్ష్మినారాయణ ముందే సెటైర్ వేసేశారు. దాంతో, కొంత అసహనానికి గురైనట్లు కన్పించిన లక్ష్మినారాయణ, ఆ విషయమై సరైన రీతిలో వివరణ ఇవ్వలేకపోవడం గమనార్హం.
ఇక, బీజేపీ వైపుగా లక్ష్మినారాయణ అడుగులు పడుతున్నట్లుగా గత కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతోన్న విషయం విదితమే. ఈ తరహా స్పెక్యులేషన్స్‌కి అవకాశమివ్వడం లక్ష్మినారాయణకు కొత్తేమీ కాదు. ‘నిప్పు లేకుండా పొగ రాదు కదా..’ అని ప్రశ్నిస్తే, ‘నిప్పు మీరే పుట్టిస్తారు.. పొగ కూడా మీరే తీసుకొస్తారు..’ అంటూ మీడియాపై తనదైన స్టయిల్లో సెటైర్లు వేశారు.
మరోపక్క, లక్ష్మినారాయణ వైసీపీ వైపు వెళతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ‘ప్రస్తుతానికి ప్రజలతోనే వున్నాను.. ఏ పార్టీలో చేరాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదు.. ముఖ్యమంత్రి పదవి వస్తే.. అదొక బాధ్యతగా భావిస్తాను’ అని లక్ష్మినారాయణ తన తాజా ఇంటర్వ్యూలో మనసులోని మాటను బయటపెట్టారు.