ఆచార్య చిత్రం షూటింగ్‌తో బిజీ బిజీగా ఉండాల్సిన దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయ్యాడు. భరత్ అనే నేను సినిమా విడుదలై రెండేళ్లు అయ్యింది. చిరంజీవితో సినిమా అనుకోవడం వల్ల చాలా సమయం కొరటాలకు వృదా అయ్యింది. కెరీర్‌లో వరుసగా చిత్రాలు చేస్తూ వస్తున్న కొరటాలకు ఇది చాలా పెద్ద గ్యాప్ అయ్యింది. ఆచార్యతో ఆ గ్యాప్‌ను ఫిల్ చేయాలని భావించినా మళ్లీ సినిమా ఆలస్యం అవుతూనే ఉంది.
ఆచార్యను ఆగస్టులో విడుదల చేయాలనుకున్నా ఇప్పుడు సాధ్యం అయ్యేలా లేదు. ఆచార్య ఎలాగూ ఆలస్యం అవుతుంది కనుక ఆ తర్వాత సినిమా అయినా ఆలస్యం కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో అప్పుడే తదుపరి చిత్రం స్క్రిప్ట్‌ను దాదాపుగా పూర్తి చేసినట్లుగా సమాచారం అందుతోంది. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కొరటాల తదుపరి చిత్రం అక్కినేని హీరో అఖిల్‌తో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ చిత్రంను చేస్తున్నాడు.
బ్యాచిలర్ చిత్రం కూడా ఈ సమ్మర్‌లో విడుదల కావాల్సి ఉండగా లాక్‌డౌన్ కారణంగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అఖిల్ తదుపరి చిత్రం కొరటాల దర్శకత్వంలో అంటూ ఇప్పటికే అక్కినేన వర్గాల వారు అనధికారికంగా చెప్పేశారు. సినిమా షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. కాని వచ్చే ఏడాది చివర్లో మాత్రం సినిమా వచ్చేలా దర్శకుడు కొరటాల శివ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడట. దర్శకుడు కొరటాల శివ అయిదు సంవత్సరాల్లో తన సినీ కెరీర్ కు గుడ్ బై చెప్తానంటూ ప్రకటించాడు. అందుకే ఈ లోపు ఎక్కువ సినిమాలు చేయాలని ఖాళీ టైంలో కూడా స్క్రిప్ట్ వర్క్ చేస్తూ బిజీగా గడిపేస్తున్నాడు.