‘ఇప్పటిదాకా మేం రాజకీయం చేయలేదు. ఇకపై రాజకీయం చేయబోతున్నాం. మీరెలా మా మీద రాజకీయ యుద్ధం చేస్తున్నారో.. అదే బాటలో, మీ మీద మేం రాజకీయ యుద్ధం చేయబోతున్నాం. పేరు పేరునా ప్రతి ఒక్కిరినీ గుర్తు పెట్టుకుంటాం. జనసైనికులూ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన, పెడుతున్న ప్రతి ఒక్కరి పేర్లూ జాగ్రత్తగా రాసి పెట్టుకోండి.. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతోంది.. మనం అధికారంలోకి రాబోతున్నాం.. ఆ నాయకుడికి చెబుతున్నా, తాట తీసి మోకాళ్ళ మీద కూర్చోబెడతా..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అత్యంత సున్నితంగా.. తన సహజ శైలికి చాలా చాలా భిన్నంగా స్వీట్ వార్నింగ్ ఇచ్చేశారు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వేదికగా.
‘అధికారం రెండు కులాలకే పరిమితమైతే ఎలా.? అన్ని కులాలకీ అధికారం దక్కాలి.. సమాజంలో అన్ని వర్గాలకీ అధికారం దక్కాలి. మూడో వైపు ఖచ్చితంగా ప్రజలు చూడాలి. ఎవరైతే అణగదొక్కబడుతున్నారో, వాళ్ళందరికీ జనసేన పార్టీ అండగా వుంటుంది. వాళ్ళంతా జనసేన భావజాలాన్ని అర్థం చేసుకోవాలి..’ అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
‘నేనెవరి కోసం రాజకీయాలు చేయాలి.? డబ్బు కోసమైతే, రాజకీయాలు నాకు అవసరం లేదు. పేరు ప్రఖ్యాతులు.. సినిమా రంగం కంటే, రాజకీయాల్లో ఎక్కువేమీ రావు.. సినీ నటుడిగా నన్ను ఆదరించారు. అంతకన్నా మీ నుంచి నేను ఎక్కువ ఏం ఆశిస్తాను.? మీ కోసమే నిలబడ్డాను..’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ప్రజల సమస్యల మీద గొంతు విప్పుదామనుకున్నాం.. ఈ క్రమంలో రాజకీయాలు చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇకపై ప్రజల తరఫున నిలబడతాం, అదే సమయంలో రాజకీయం కూడా చేస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టతనిచ్చారు.
‘మీరు గెలిచి, ఇతర పార్టీల నేతల్ని అడ్డగోలుగా మీ పార్టీలోకి లాగెయ్యొచ్చా.? ప్రజల కోసం, ప్రజల సమస్యలపై గొంతు విప్పేందుకు.. మేం ఇతర రాజకీయ పార్టీలతో కలిస్తే అది తప్పా.?’ అని పవన్ ప్రశ్నించారు. ప్రజారాజ్యం పార్టీ నాటి అనుభవాల్ని కూడా పవన్ గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ చేసిన రాజకీయ ప్రసంగాలన్నిటిలోకీ, నేటి ఈ ప్రసంగం చాలా చాలా ప్రత్యేకమైనది. గ్రామ సింహాలు.. అంటూ ప్రసంగం ప్రారంభించినా.. ఒకటీ అరా సందర్భాల్లో కొంత ఆవేశానికి గురైనా.. చాలా వ్యూహాత్మకమైన ప్రసంగం పవన్ కళ్యాణ్ చేశారు.
పార్టీ శ్రేణులకు అభయమిచ్చారు.. వారిని ఉత్సాహపరిచారు. యువతరం నుంచి వృద్ధులదాకా.. అందరికీ అర్థమయ్యేలా.. అత్యంత చాకచక్యంగా ప్రసంగం చేశారు. 16 – 17 ఏళ్ళ నేటి యువత రాజకీయాల పట్ల అవగాహన పెంచుకోవాల్సిన విషయంపై పవన్ చేసిన ప్రస్తావన.. ఆయన ప్రసంగంలోనే హైలైట్ పాయింట్. ‘మిమ్మల్ని దార్లో పెట్టేది.. 16-17 ఏళ్ళ యువత..’ అని చెప్పడం ద్వారా, యువత రాజకీయాలపై అవగాహన పెంచుకోవాల్సిన విషయాన్ని ప్రస్తావించి జనసేనాని అందరి దృష్టినీ ఆకర్షించారు.