సినిమా ఈవెంట్‌లో రాజకీయాలు మాట్లాడటమేంటి.? అంటూ మొన్నామధ్య ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జనసేన అధినేత చేసిన వ్యాఖ్యలపై పెను రాజకీయ దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కంటెంట్ అలాంటిది. అప్పటి రాజకీయం అలాంటిది. సినీ పరిశ్రమపై నిస్సిగ్గుగా జరిగిన దాడిపై పవన్ కళ్యాణ్ అలా ఘాటుగా స్పందించక తప్పలేదు.
కానీ, పరిశ్రమ తరఫున పవన్ కళ్యాణ్ అప్పట్లో గట్టిగా నిలబడ్డారు. అలాగే, తానూ నిలబడేందుకు మరో హీరో నాని ప్రయత్నించాడు. అందుకే ఆ ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ ఆగ్రహానికి గురయ్యారు. అది గతం. తాజాగా, ‘అంటే సుందరానికి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ ఏ రాజకీయ ప్రసంగం చేస్తారో, నాని ఏ రాజకీయ విమర్శలకు తావిస్తాడోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూశారు.
అయితే, అలా ఎదురుచూసినవారికి పవన్ కళ్యాణ్ నిరాశనే మిగిల్చారు. పరిశ్రమ ఒక్క కుటుంబానిది కాదన్నారు. పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ స్థానం వుందన్నారు. ఉత్తరాది నుంచి కళాకారులొస్తారు, మలయాళం నుంచి హీరోయిన్ వచ్చింది.. అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం గమనార్హం. పక్కనే, సీనియర్ నటుడు నరేష్ కూడా వున్నారు. ‘మా’ ఎన్నికల సమయంలో ప్రాంతీయ రచ్చకు తెరలేపింది నరేష్ కావడంతో, పవన్ కళ్యాణ్ సుతిమెత్తగా కౌంటర్ ఎటాక్ చేశారిప్పుడు. ‘నరేష్ అంటే అభిమానం..’ అంటూనే, గట్టిగా గిల్లేశారు నరేష్‌ని పవన్ కళ్యాణ్.
‘పరిశ్రమలో ప్రతి హీరో సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాం. ఏ సినిమా కూడా ఫెయిల్ అవ్వాలని అనుకోం. హీరోలందరం కలిసే వుంటాం. ఇతర హీరోల సినిమాలూ హిట్టవ్వాలని కోరుకుంటాం.. మా సినిమా ఇంకాస్త పెద్ద హిట్టవ్వాలని కోరుకోవడం ఏ హీరోకి అయినా సహజమే..’ అంటూ ఫ్యాన్ వార్ మీద కూడా పరోక్షంగా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు.
తెలుగు సినీ పరిశ్రమ తరఫున, హీరోయిన్ నజ్రియాకి స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్. నాని నటుడిగానే కాదు, వ్యక్తిత్వం పరంగా కూడా బలమైన వ్యక్తి.. అంటూ నానిని పవన్ కొనియాడటం గమనార్హం. ‘రాజకీయాల్లో గొడవకు వెళ్ళాలంటే ధైర్యంగా వెళ్ళిపోతాను.. కానీ, నా ఏవీ చూడాలంటే భయపడతాను.. అభిమానులు చేసే అల్లరి తట్టుకోలేక డాన్సులు వేస్తాను. ఇకపై నా నుంచి డాన్సులు కోరుకోవద్దు..’ అంటూ పవన్ వ్యాఖ్యానించారు.
సినిమా వేరు, రాజకీయం వేరు.. అంటూ పవన్ కళ్యాణ్ కుండబద్దలుగొట్టేశారు.
Share