మెగాస్టార్ చిరంజీవి కొడుకు హీరోగా వస్తున్నాడు. ఎలా ఉంటాడో.. డ్యాన్స్ ఎలా చేస్తాడు.. ఫైట్స్ ఎలా చేస్తాడు.. తండ్రి పేరు నిలబెడతాడా..? మెగా అభిమానుల ఆలోచనలు, ఆశలు ఆ స్థాయిలోనే ఉన్నాయ మరి. ఈ ప్రశ్నలన్నింటికీ తొలి సినిమా ‘చిరుత’తోనే సమాధానం చెప్పేశాడు రామ్ చరణ్. 2007 సెప్టెంబర్ 28న విడుదలైన ఈ సినిమాకు నేటితో 13 ఏళ్లు పూర్తయ్యాయి. చిరంజీవి తమ్ముడిగా 1996లో పవన్ కల్యాణ్ ఎంట్రీపై మెగాభిమానుల్లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో 11 ఏళ్ల తర్వాత చిరంజీవి కుమారుడి విషయంలోనూ అదే జరిగింది.
27 రాత్రి నుంచే రాష్ట్రం మొత్తం షోలో పడిపోయాయి. రామ్ చరణ్ ఎంట్రీ ఫైట్ తోనే రఫ్పాడించేసాడు. తొలి పాటలో చరణ్ స్టెప్స్ కు అభిమానుల ఈలలు, కేకలతో ధియేటర్లు దద్దరిల్లిపోయాయి. అన్నయ్య పేరు నిలబెట్టేశాడు.. వారసుడొచ్చేశాడు.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించాడు.. అంటూ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నిజంగానే చరణ్ తన నటన, సెంటిమెంట్, కామెడీ, యాక్షన్, ఫైట్స్.. అన్నింటా తనకు తాను ప్రూవ్ చేసుకున్నాడు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టేశాడు చరణ్. ‘చిరుత’తో రామ్ చరణ్ సాధించిన తొలి సినిమా కలెక్షన్ల రికార్డును ఇప్పటికీ చరణ్ పేరు మీదే ఉంది.
చరణ్ ను పూరి జగన్నాధ్ ఆస్థాయిలో చూపించాడు. రామ్ చరణ్ స్టార్ హీరో కావడానికి ఎక్కువ టైమ్ తీసుకోలేదు. రెండో సినిమా ‘మగధీర’తో ఏకంగా సౌత్ ఇండియా రికార్డు నెలకొల్పాడు. ఆ తర్వాత మినిమమ్ రేంజ్ సినిమాలు కూడా మంచి కలెక్షన్లు సాధిస్తూ చరణ్ ఇమేజ్ లెవల్స్ ను చెప్తున్నాయి. ఇక రంగస్థలంతో చరణ్ సృష్టించిన కలెక్షన్ల సునామీ, నటనలో పరిణితి మెగాస్టార్ చిరంజీవి వారసుడంటే మాజాకా.. నా అనిపించింది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నాడు రామ్ చరణ్.