థియేటర్లు నాలుగు నెలలుగా మూతపడే ఉన్నాయి. మరో రెండు మూడు నెలల వరకు కూడా ఓపెన్ అయ్యేది నమ్మకం తక్కువే. ఆ తర్వాత అయినా ఓపెన్ అవుతాయా అంటే అది కూడా చెప్పలేం అంటున్నారు. అందుకే మొదట్లో ఓటీటీ రిలీజ్ కు ఆసక్తి చూపని స్టార్స్ ఇప్పుడు తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేసినా పర్వాలేదు అన్నట్లుగా ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేసేందుకు ఒప్పుకుంటున్న క్రమంలో సౌత్ ఇన్ని రోజులు నిర్మాతలను ఓటీటీ రిలీజ్ కు వెళ్లకుండా అడ్డుకున్నారు.
రవితేజ హీరోగా తెరకెక్కిన ‘క్రాక్’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. థియేటర్లు ఓపెన్ లేకపోవడంతో నిర్మాత ఆర్థికంగా నష్ట పోవద్దనే ఉద్దేశ్యంతో ఓటీటీ రిలీజ్ కు రవితేజ ఓకే చెప్పాడట. తాజాగా రవితేజ ఓటీటీ విడుదలకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నాడట. రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రస్తుతం క్రాక్ చిత్రం ఓటీటీ విడుదలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయట. నిర్మాత ఆశించిన అమౌంట్ వస్తే ఓటీటీ రిలీజ్ కు క్రాక్ రెడీ అయ్యే అవకాశం ఉంది.
రవితేజ పోలీస్ గా కనిపించబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కనుక ఓటీటీలో విడుదల అయితే టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలు ఈ చిత్రంతోనే అవుతుంది. ఇప్పటి వరకు చిన్న చితక సినిమాలు మాత్రమే ఓటీటీలో విడుదల అయ్యాయి. నోటెడ్ హీరో నటించిన ఒక్క సినిమా కూడా ఓటీటీలో డైరెక్ట్ గా విడుదల కాలేదు. క్రాక్ విడుదల అయితే మరిన్ని సినిమాలు కూడా ఓటీటీ విడుదలకు సిద్దం అయ్యే అవకాశం ఉంది. క్రాక్ నిర్మాతల ప్రకటన కోసం రవితేజ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.