తెలుగులో చాలా బిజీగా ఉండే కేరక్టర్ ఆర్టిస్టులలో ఒకరుగా సాయికుమార్ కనిపిస్తున్నారు. ఓ మాదిరి బడ్జెట్ సినిమాల్లో ఆయన ఎక్కువగా కనిపిస్తున్నారు. అంతేకాకుండా వెబ్ సిరీస్ ల దిశగా కూడా చాలా వేగంగా అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆయన ‘గాలివాన’ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ .. ‘పోలీస్ స్టోరీ’ని గురించి ఆయన ప్రస్తావించారు. “ఇప్పుడు అంతా పాన్ ఇండియా మూవీ అంటున్నారు. నేను చేసిన ‘పోలీస్ స్టోరీ’ కన్నడలో సూపర్ హిట్టు .. తెలుగులో హిట్టు .. తమిళంలో హిట్టు .. హిందీలో డబ్ చేశారు .. మలయాళంలో డబ్ చేశారు. అన్ని భాషల్లోనూ హిట్. 25 ఏళ్ల క్రితమే పాన్ ఇండియా సినిమా చేశాను.
‘రొబేరో’తో కలిసి నేను ఈ సినిమాను ముంబైలో చూడటం జరిగింది. ‘అర్థ సత్య’ క్లాస్ ఫిల్మ్ .. పోలీస్ స్టోరీ మాస్ ఫిల్మ్ అని ఆయన అనడం జరిగింది. తమిళనాడులో ఈ రోజుకీ ఈ సినిమాను ఎవరూ మరిచిపోలేదు.
ఈ రోజున మనం బిజినెస్ పరంగా పెరిగాము. 100 కోట్లు అనేదే మనకు పెద్ద న్యూస్ .. అలాంటి తెలుగు సినిమా ఈ రోజున 1000 కోట్లకు వెళ్లిపోయింది. ఆ రోజున ‘పోలీస్ స్టోరీ’ 10 కోట్లు వసూలు చేసిందంటేనే చాలా గొప్పగా చెప్పుకున్నాము. ఈ రోజుల్లో ఒక సినిమా కనెక్ట్ అయిందంటే ఎవరూ కూడా దానిని ఆపలేరు.
ఇక ‘గాలివాన’ వెబ్ సిరీస్ విషయానికి వస్తే ఏప్రిల్ 14 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ను చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. కోవిడ్ సమయంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై అద్భుతమైన సినిమాలు చూశాను .. మనం కూడా ఇలా చేస్తే బాగుంటుందే అనుకున్నాను. భగవంతుడు పంపించినట్టుగా ఈ వెబ్ సిరీస్ రావడం జరిగింది. ఇంతవరకూ నేను రాధిక గారి కాంబినేషన్లో చేయలేదు. ఈ వెబ్ సిరీస్ లో నేను . తను రెండు పిల్లర్స్ లా కనిపిస్తాము. కొమర్రాజు .. సరస్వతి అనే రెండు కుటుంబాల సంఘర్షణే ‘గాలివాన’.
ఎలా ఉంటుంది? ఏంటి? అనేది చూస్తేనే మీరు థ్రిల్ ఫీలవుతారు. వాస్తవానికి దగ్గరగా .. చాలా సహజంగా .. ప్రతి పాత్రకి ఆ ప్రాముఖ్యత ఉంటుంది. కథ .. కథనం .. సంగీతం .. రీ రికార్డింగ్ .. కెమెరా పనితనం ఈ కథకి చాలా ఇంపార్టెంట్. మేము చేయవలసిన పని సిన్సియర్ గా చేశాము. ఎలా ఉందనేది ప్రేక్షకులు చెప్పాల్సి ఉంటుంది.
ఒక మంచి ఫ్లాట్ ఫామ్ పై ‘ గాలివాన’ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకూ .. రాధిక గారికి కూడా ఇది ఫస్టు వెబ్ సిరీస్. నా కెరియర్ లో చాలామంది సీనియర్స్ తో కలిసి వర్క్ చేశాను. రాధిక గారితోనే మిస్సవుతూ వచ్చాను. ఆ అవకాశం ఇలా వచ్చింది” అని చెప్పుకొచ్చారు .