జర్నలిస్ట్ మూర్తి.. గతంలో పలు ఛానళ్ళలో పనిచేశాడు. సంచలనాలకోసం ఎంత యాగీ చేయాలో అంతా చేసేస్తాడాయన. మొన్నీమధ్యనే ఓ ఛానల్ నుంచి ఆయన బయటకొచ్చేయడానికి కారణం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తప్పుడు కథనాల్ని సృష్టించడమేనన్నది మీడియా వర్గాల్లో బలంగా విన్పిస్తోన్న అభిప్రాయం. ఆ సంగతి పక్కన పెడితే, ప్రస్తుతం టీవీ5 మూర్తిగా తన హవా చాటుతున్న ఈ సీనియర్ జర్నలిస్ట్‌ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారంటూ రెండు మూడు రోజులుగా పెద్దయెత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఇంతకీ, టీవీ5 మూర్తిని ఎందుకు పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు.? అసలు ఈ అరెస్ట్ వార్తల్లో నిజమెంత.? ఇలా రకరకాల ఊహాగానాలు మీడియా వర్గాల్లో జరుగుతున్నాయి. మరోపక్క ‘వి సపోర్ట్ టీవీ 5 మూర్తి’ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కి అనుకూలంగా మూర్తి ఓ బులెటిన్‌ని ప్రసారం చేశారనీ, నిమ్మగడ్డ కేంద్రానికి రాసిన లేఖ కూడా తొలుత మూర్తికే అందిందనీ.. ఆ కారణంగానే పోలీసులు, మూర్తిని అరెస్ట్ చేయబోతున్నారన్నది ఓ ప్రచారం తాలూకు సారాంశం.
అయితే, జస్ట్ విచారణకు పిలిచే అవకాశం వుండొచ్చుగానీ.. అరెస్ట్ అయ్యేంత సీన్ వుండదన్నది మీడియా వర్గాల్లో విన్పిస్తోన్న మాట. సహజంగానే పబ్లిసిటీ స్టంట్లకు అలవాటుపడిపోయిన మూర్తి, చాలా తెలివిగా ‘వి సపోర్ట్ టీవీ5 మూర్తి’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని తానే స్వయంగా తన సన్నిహితుల ద్వారా సృష్టించుకుని నానా యాగీ చేయిస్తున్నారంటూ ఈ మొత్తం వ్యవహారంపై వైసీపీ వర్గాలు లైట్ తీసుకుంటుండడం గమనార్హం.
ఒక్కటి మాత్రం నిజం.. చర్చా కార్యక్రమంల్లో మూర్తి ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. అది గతంలోనూ ప్రూవ్ అయ్యింది.. ఇప్పుడూ ప్రూవ్ అవుతోంది. అయినాగానీ, ఆ వంక పెట్టి మీడియా మీద వైఎస్ జగన్ సర్కార్ ఉక్కుపాదం మోపాలనుకుంటే.. వ్యవహారం కొత్త వివాదానికి దారి తీసే అవకాశం లేకపోలేదు. అసలే టీవీ5 ఛానల్ అంటే వైసీపీకి అస్సలు గిట్టడంలేదు.. ఆ ‘కసి’ మూర్తి మీద వైసీపీ ప్రభుత్వం తీర్చుకుంటుందా.? వేచి చూడాల్సిందే.