వైసీపీ ఎంపీ (రాజ్యసభ) విజయసాయిరెడ్డి తెలియక చేస్తారో, కావాలనే చేస్తారోగానీ.. ఆయన నుంచి దూసుకొచ్చే ట్వీట్స్ అధికార పార్టీని అడ్డంగా బుక్ చేసేస్తుంటాయి. ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిని ఇరకాటంలో పడేసే క్రమంలో విజయసాయిరెడ్డి చూపే అత్యుత్సాహం అధికార వైఎస్సార్సీపీని, అందునా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డినీ అభాసుపాలుచేస్తోంది.
నిన్నటికి నిన్న ‘తప్పదు, గొలుసులతో కట్టేయాల్సిందే..’ అంటూ చంద్రబాబు మీద పరోక్షంగా సెటైర్ వేశారు ట్విట్టర్ ద్వారా విజయసాయిరెడ్డి. ‘ఏం, ఏడాదిన్నరపాటు గొలుసులతో కట్టేసి జైల్లో పడేసిన విషయం గుర్తుకొచ్చిందా..’ అంటూ టీడీపీ శ్రేణులు, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తోపాటు, విజయసాయిరెడ్డిని సోషల్ మీడియా ద్వారా నిలదీయడం గమనార్హం.
కొందరు వైసీపీ మద్దతుదారులకు విజయసాయి ట్వీట్లు బాగానే నచ్చుతున్నా, చాలామంది వైసీపీ నేతలు ఆయన వ్యవహారశౖలిని జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా, ‘కరోనా రత్న’ అవార్డు పేరుతో విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా ఓ ప్రశ్న సంధించి, కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. అందులో చంద్రబాబు, లోకేష్ సహా పలువురు టీడీపీ నేతల పేర్లు గుర్తుకొచ్చేలా ‘పెదనాయుడు’ అనీ, ఇంకోటనీ పేర్కొన్నారు. అట్నుంచి కౌంటర్‌గా, వైసీపీకి చెందిన కొందరు నేతల పేర్లను టీడీపీ మద్దతుదారులు ప్రస్తావిస్తుండడం గమనార్హం.
‘పెదనాయుడు, చిననాయుడు, మలమలకృష్ణరాముడు, దయనేని రమ, భజన చౌ’ అని విజయసాయి పేర్లు పెడితే, ‘విసారెడ్డి, భజన రెడ్డి, గుడివాడ సన్యాసి, నోటిదూల యాదవ్, బొత్స నత్తిబాబు, సత్తెనపల్లె ఎర్రిబాబు, నమ్మలేని సీతారాం’ అంటూ టీడీపీ మద్దతుదారులు కౌంటర్ ఇచ్చారు.
అంతేనా, ‘బియ్యం రెడ్డి, ఆర్కే లోజ, విడదల వర్జిని, వెంకట్ లౌడ, చర్లపల్లి చిప్పకూడు రెడ్డి’ అని కూడా ప్రస్తావించారు కొందరు నెటిజన్లు. ‘జలగం, కసాయి / సీసాయి / విసాయి, గుడివాడ గోళి, తస్సదియ్య నత్తిబాబు, పేరుకుపోయిన నెయ్యి’ లాంటి ప్రస్తావనలూ సోషల్ మీడియాలో కన్పిస్తున్నాయి.
ఒక్క ట్వీట్‌తో వంద తిట్లు తినడమెలాగో విజయసాయిరెడ్డికి బాగా తెలుసన్న విషయం ఈ ‘కరోనా రత్న’ ఎపిసోడ్‌తో మరోమారు స్పష్టమవుతోందని వైసీపీ మద్దతుదారులు సైతం మొత్తుకుంటున్నా విజయసాయిలో మార్పు రావడంలేదెందుకో!