వ్యక్తులు శాశ్వతం కాదు.. వ్యవస్థలే శాశ్వతం.. ఇది ముమ్మాటికీ నిజం. 151 స్థానాలతో విజయం కట్టబెట్టారు.. మేం చెప్పిందే ఫైనల్ అని వ్యవస్థల్ని కాదంటే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో వైఎస్సార్ సీపీకి నెమ్మదిగా అర్థమవుతున్నాయి. వరుసగా ఒక్కో అంశంలోనూ ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. దీంతో కిందకు దిగిరాక తప్పని పరిస్థితి నెలకొంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎపిసోడ్ లో అలాంటి పరిస్థితే తలెత్తింది. పట్టుదలకు పోయి తుదకంటా పోరాడినా ప్రతికూలతలే రావడంతో వెనక్కి తగ్గక తప్పలేదు. వేరే మార్గంలో వెళితే తాము అనుకున్నది చేసే వెసులుబాటు ఉన్నా.. సర్కారు పెద్దలు మొండి పట్టుదలతో ముందుకెళ్లి బొక్కబోర్లా పడుతున్నారు.
ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడం అనే విషయాన్నే తీసుకుంటే.. హైకోర్టు వద్దని చెప్పినప్పడే ఆగిపోతే సరిపోయేది. కానీ అలా కాకుండా సుప్రీంకోర్టుకు వెళ్లి దెబ్బ తిన్నారు. తర్వాత కూడా పట్టు విడవకుండా మరో రంగు యాడ్ చేసి ఏదో చేద్దామని భావించి అక్కడా విఫలమయ్యారు. చివరకు రంగులన్నీ తీసేయక తప్పలేదు. ఇక శాశన మండలి రద్దు విషయంలోనూ అలాగే చేశారు. ఏడాది తర్వాత మండలిలో మెజార్టీ అధికార పార్టీకే దక్కే అవకాశం ఉన్నా.. రద్దు చేసేయడమే బెటరనే నిర్ణయానికి వచ్చేశారు. కానీ కేంద్రం దానిని పట్టించుకున్న పాపానే పోలేదు. దీంతో వైసీపీ కూడా కాస్త మెత్తబడి మండలిలో ఖాళీలను నియమిస్తోంది.
ఇంగ్లిష్ మీడియం విషయంలో కూడా పెద్ద రగడే జరిగింది. తాజాగా 5వ తరగతి వరకు అమ్మభాషలోనే బోధన తప్పనిసరి అని కేంద్రం కొత్త విద్యా విధానంలో స్పష్టంచేసింది. ఇక నిమ్మగడ్డ ఎపిసోడ్ కూడా వైసీపీ అదే ధోరణి కనబరిచింది. కరోనా కారణంగా స్థానిక ఎన్నికలు వాయిదా వేయడంతో దుమారం మొదలైంది. తమను కనీసం సంప్రదించకుండా నిమ్మగడ్డ ఈ నిర్ణయం తీసుకోవడంతోనే సర్కారు ఆయనపై కత్తి కట్టింది. సుప్రీంకోర్టు సైతం ఈ విషయంలో నిమ్మగడ్డను తప్పుబట్టినా.. ఎన్నికల వాయిదా సబబేనని తేల్చి చెప్పింది. అప్పటినుంచీ ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్న తర్వాత చివరకు నిమ్మగడ్డను ఎన్నికల కమిషనర్ గా పునర్నియమించక తప్పలేదు.
నిజానికి ఆయన పదవీ కాలం వచ్చే ఏడాది ఏప్రిల్ తో ముగుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపించడంలేదు. వచ్చే ఏడాదికి పరిస్థితులన్నీ సద్దుమణిగినా.. సర్కారుకు ఇష్టం లేకుంటే నిమ్మగడ్డ పదవి నుంచి దిగిపోయే వరకు స్థానిక సంస్థల ఎన్నికలను తాత్సారం చేయడం పెద్ద కష్టం ఏమీ కాదు. లేదంటే కేంద్ర మాజీ ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ విషయంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు అనుసరించిన పద్ధతిలో వెళ్లే అవకాశం ఉంది.
శేషన్ అధికారాలను కత్తెర వేయడం కోసం పీవీ.. మరో ఇద్దరు కమిషనర్లను నియమించారు. దీంతో కీలక నిర్ణయాలను మెజార్టీ కమిషనర్ల అభిప్రాయం మేరకు తీసుకునే అవకాశం వచ్చింది. కొత్త కమిషనర్లు ఎలాగే పీవీకి అనుకూలమే కాబట్టి, ఆయనకు కావాల్సిన విధంగానే నిర్ణయాలు వెలువడేవి. ఇలా ఒక పని చేయాలంటే బోలెడు మార్గాలుంటాయి. ఇందుకు కాస్త సంయమనం, కాస్త లౌక్యం ప్రదర్శించాల్సి ఉంటుంది. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసుండాలి. మరి వైసీపీకి ఇప్పటికైనా తత్వం బోధపడినట్టేనా?