తమిళనాట స్టార్ హీరోలకు అప్పుడప్పుడు రాజకీయ వేదింపులు కొత్తేం కాదు. హీరోలు రాజకీయంగా వ్యాఖ్యలు చేయడం ఆ హీరోలపై రాజకీయ నాయకులు ఒత్తిడి తీసుకు వచ్చేలా పనులు చేయడం మనం చూస్తూనే వచ్చాం. రజినీ.. కమల్ వంటి స్టార్స్‌కే రాజకీయ వేదింపులు తప్పలేదు. ఇప్పుడు విజయ్‌కి కూడా రాజకీయంగా వేదింపులు ఎదురవుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంపై విజయ్ తన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక విధంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చాడు.
విజయ్ తీరుపై అసహనంతో ఉన్న కేంద్రం ఆయన్ను కక్ష సాధించేందుకు ఆదాయపన్ను శాఖను వాడుతున్నట్లుగా ఆయన ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. గత నెల రోజులుగా విజయ్ పై ఆదాయపన్ను శాఖ చేస్తున్న సోదాలు.. ఎంక్వౌరీలు.. విచారణలు అన్నీ ఇన్నీ కావు. బిగిల్ సినిమాతో మొదలై ఇప్పుడు విజయ్ నటిస్తున్న మాస్టర్ సినిమా వరకు అన్ని విధాలుగా విజయ్‌ని ఇరికించేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
నేడు ఉదయం నుండి మద్యాహ్నం వరకు ఐటీ సోదాలు జరిగినట్లుగా తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం కూడా విజయ్ ఇంట ఐటీ సోదాలు జరిగాయి. ఇంత తక్కువ సమయంలో విజయ్ ఇంట రెండవ సారి ఐటీ సోదాలు జరగడం ఆశ్చర్యంగా ఉందంటూ అంతా నోరు వెళ్లబెడుతున్నారు. ఇది ఖచ్చితంగా విజయ్‌పై కక్ష సాదింపు చర్య అంటూ ఆయన అభిమానులు ఎన్డీయే తీరుపై సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.